LOADING...
US: ట్రంప్‌ కీలక నిర్ణయం.. అమెరికాలో ఇక 'యుద్ధ మంత్రిత్వ శాఖ' 
ట్రంప్‌ కీలక నిర్ణయం.. అమెరికాలో ఇక 'యుద్ధ మంత్రిత్వ శాఖ'

US: ట్రంప్‌ కీలక నిర్ణయం.. అమెరికాలో ఇక 'యుద్ధ మంత్రిత్వ శాఖ' 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2025
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌, దేశ పరిపాలన, అంతర్జాతీయ సంబంధాలు, పన్నుల విషయాలలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నో విభాగాలు, పాలనా విధానాల్లో సార్వత్రిక మార్పులు ఆయన కార్యాలయంలో చోటుచేసుకున్నాయి. తాజాగా, అమెరికా రక్షణ శాఖ (Department of Defence)ను 'డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ వార్'గా మార్చేందుకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే పేరుతో మంత్రిత్వ శాఖ ఉండగా.. 1947లో అమెరికా క్యాబినెట్‌ పునరుద్ధరణలో భాగంగా 'డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ వార్' పేరును రద్దు చేసి, ప్రస్తుతం ఉన్న 'రక్షణ శాఖ'గా మార్చారు. ఇప్పుడు ట్రంప్ మళ్లీ దానిని పునరుద్ధరించి, పెంటగాన్‌ పేరును మారుస్తూ కీలక చర్యలకు సిద్ధమవుతున్నారు.

వివరాలు 

ఈ నిర్ణయానికి మద్దతు పలికిన ట్రంప్‌ పాలకవర్గ సభ్యులు

అమెరికా అధ్యక్ష కార్యాలయంలో ట్రంప్ మాట్లాడుతూ, "పీట్ హెగ్సెత్ తరచుగా 'రక్షణశాఖ'గా సంబోధిస్తారు. అది నాకు నచ్చలేదు. రక్షణ అనే పదం ఎందుకు? గతంలో పిలిచిన విధంగా, ఇకపై 'డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ వార్' అని పిలుద్దాం. ఈ పేరు ఎంతో శక్తివంతమైనది. దానే అమెరికాను మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో విజయవంతం చేసింది. ప్రతి సందర్భంలో ముందుండే శక్తిని ఇస్తుంది. ఇప్పుడు కూడా అదే పేరుతో మరింత ముందుకు పోదాం," అని చెప్పారు. ట్రంప్‌ పాలకవర్గ సభ్యులు కూడా ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. తద్వారా, ఈ పేరు మార్పుపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

వివరాలు 

అమెరికా రక్షణ శాఖ చరిత్ర 

అమెరికాలో 1789లో యుద్ధ విభాగాన్ని ఏర్పాటు చేశారు. సైన్యం,నేవీ దళాల పర్యవేక్షణ కోసం ఓ యుద్ధ కార్యదర్శి ఉండేవారు. 1798లో ప్రత్యేక నేవీ విభాగాన్ని ప్రారంభించారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత, 1947 జాతీయ భద్రతా చట్టం ప్రకారం, అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్‌ ప్రత్యేక సైనిక, వైమానిక విభాగాలను రూపొందించి, జాతీయ సైనిక సంస్థను ఏర్పాటు చేశారు. 1949లో మూడు సైనిక దళాలను ఒకే ఆధ్వర్యంలో కేంద్రీకరించి, దీన్ని రక్షణ శాఖ (US Defence Department)గా మార్చారు. ప్రస్తుతం అమెరికా రక్షణ శాఖ మంత్రి పదవిని పీట్ హెగ్సెత్ చేపడుతున్నారు.