US Elections: అమెరికా ఎన్నికల ఫలితాలు.. ట్రంప్ 188, హారిస్ 99 ఎలక్టోరల్ సీట్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు సగం దాటడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 17 రాష్ట్రాల్లో విజయఢంకా మోగించారు. ఇందులో నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా రాష్ట్రాలున్నాయి. ఇప్పటివరకు ట్రంప్ 188 ఎలక్టోరల్ సీట్లు సాధించారు. ఇక డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ 9 రాష్ట్రాల్లో విజయాలు సాధించారు. ఆమె ఇల్లినోయీ, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలవేర్, మసాచుసెట్స్, రోడ్ ఐల్యాండ్ రాష్ట్రాల్లోని 99 ఎలక్టోరల్ ఓట్లు సంపాదించారు.
ఉత్కంఠభరితంగా ఎన్నికల ఫలితాలు
ప్రస్తుతం కీలకంగా భావిస్తున్న జార్జియా రాష్ట్రంలో కమలా హారిస్ పోటీని కఠినంగా ఎదుర్కొంటున్నారు. 2020లో ఈ రాష్ట్రం డెమోక్రటిక్ పార్టీకి 16 ఎలక్టోరల్ ఓట్లను అందించింది. దీంతో పాటు పెన్సిల్వేనియా రాష్ట్రంలో పిట్స్‌బర్గ్, ఫిలడెల్ఫియా వంటి ప్రధాన నగరాల్లో హారిస్ ఆధిక్యంలో ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ సన్నివేశంలో ఎన్నికల ఫలితాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి.