US elections 2024: డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో, ఆయన క్రిమినల్ కేసులు ఏమవుతాయి?
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన నేపథ్యంలో, డొనాల్డ్ ట్రంప్ పై ఉన్న కేసులు ఆసక్తికరంగా మారాయి. 2020 ఎన్నికల తర్వాత ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని క్రిమినల్ కేసులు కాగా, మరికొన్ని సివిల్ కేసులు ఉన్నాయి. ఒక కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్న సందర్భమూ ఉంది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడు కూడా ఆయనే!
ఆ కేసుల నుంచి క్షమాభిక్ష
ప్రస్తుతం ఆయన్ను చుట్టుముట్టిన ఈ కేసుల పరిస్థితే ప్రధాన చర్చనీయాంశంగా ఉంది.ఫెడరల్ కేసుల విషయంలో ఆయనకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఎందుకంటే, అధ్యక్షుడిగా ఉన్న తాను తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఆ కేసుల నుంచి క్షమాభిక్ష పొందగలడు. అయితే, న్యూయార్క్‌లోని పోర్న్‌స్టార్ కేసు, 2020లో జార్జియా ఎన్నికల ఫలితాలపై తారుమారు చేయడానికి ప్రయత్నించారన్న కేసుల విషయంలో ఆయన విచక్షణాధికారాలు పనికి రాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పోర్న్‌స్టార్ కేసులో ఈనెల 26న శిక్ష ఖరారు
పోర్న్‌స్టార్ కేసులో న్యూయార్క్ న్యాయస్థానం ఈనెల 26న శిక్ష ఖరారు చేయనుంది. అయితే, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ కేసును వాయిదా వేయాలని ట్రంప్ తరఫు న్యాయవాదులు కోరవచ్చు. ఒకవేళ తీర్పు వచ్చినా, స్వల్ప శిక్ష లేదా ఆయన పదవి నుంచి దిగేవరకు వాయిదా ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఎందుకంటే, అధ్యక్షుడిగా ఉన్నంతకాలం ఆయన శిక్ష అనుభవించరు. తనపై ఉన్న కేసులను ముగించాలని డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే పలుమార్లు చెప్పారు. కానీ, ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైనందున ఆయనపై కేసులన్నీ ఒకవిధంగా నిర్లక్ష్యానికి గురి కావచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.