
US Birthright Citizenship: డొనాల్డ్ ట్రంప్‌కి ఫెడరల్ కోర్టు షాక్..జన్మతః పౌరసత్వ హక్కుపై ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులు నిలిపివేత..
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులకు జన్మించే శిశువులకు స్వయంగా లభించే పౌరసత్వ హక్కు (బర్త్‌రైట్ సిటిజన్‌షిప్)ను రద్దు చేయాలన్న ఉద్దేశంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందడుగులు వేశారు. ఈ దిశగా ఆయన తీసుకున్న కార్యనిర్వాహక ఉత్తర్వులపై తాజాగా న్యూహాంప్‌షైర్ ఫెడరల్ కోర్టు జడ్జి జోసెఫ్ లా ప్లాంటీ స్పందించారు. ట్రంప్ ఇచ్చిన ఆ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆయన గురువారం నాడు ప్రకటించారు. ఈ ఉత్తర్వు అమెరికా అంతటికి వర్తిస్తుందని వెల్లడించారు. అయితే, దీనిపై అప్పీలుకు వీలుగా 7 రోజుల పాటు స్టే ఇచ్చారు.
వివరాలు
అమెరికాలో పుట్టిన ప్రతి వ్యక్తికీ పౌరసత్వ హక్కు
ఇక ఫెడరల్ జడ్జి తీసుకున్న ఈ నిర్ణయం ఆధారంగా సుప్రీం కోర్టులో ఈ కేసు త్వరితగతిన విచారణకు వచ్చే అవకాశముంది. ఫెడరల్ కోర్టు ఉత్తర్వులు దేశవ్యాప్తంగా అమలవుతాయా, లేక పరిమిత పరిధిలోనే వర్తిస్తాయా అనే అంశాన్ని తేల్చేందుకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు నిర్ణయం తీసుకునే అవకాశముంది. అమెరికాలో పౌరసత్వ హక్కుల విషయంలో ఇదొక కీలక ఘట్టంగా భావిస్తారు. ఎందుకంటే, అమెరికాలో పుట్టిన ప్రతి వ్యక్తికీ పౌరసత్వ హక్కు కలుగుతుందని 14వ రాజ్యాంగ సవరణలో స్పష్టంగా పేర్కొన్నారు.