
Marco Rubio: శాంతి చర్చలు నిలిచిపోతే రష్యాపై కొత్త ఆంక్షలు విధిస్తాం: మార్కో రూబియో
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధానికి శాంతి నెలకొల్పేందుకు అమెరికా కృషి చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలపై అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు.
శాంతి చర్చలు విఫలమైతే రష్యా మరిన్ని ఆంక్షలను ఎదుర్కొనే పరిస్థితి ఎదురవుతుందని ఆయన హెచ్చరించారు.
ఆయన అమెరికా సెనెట్‌లో మాట్లాడుతున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
"కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి రష్యా తన నిబంధనలను స్పష్టంగా తెలియజేయాలని కోరుతోంది. అయితే ఆ నిబంధనలు ఏమిటన్నది ఇంకా వెల్లడించలేదు. వాటిని తెలుసుకున్న తర్వాతే రష్యా యుద్ధానికి ముగింపు కై తీసుకునే దిశపై స్పష్టత కలుగుతుంది. ఈసారి శాంతిచర్చలు విజయవంతమవుతాయని ఆశిస్తున్నాను" అని రూబియో అన్నారు.
వివరాలు
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతిని తీసుకొచ్చేందుకు ట్రంప్ కృషి
అలాగే, రష్యా యుద్ధాన్ని కొనసాగించాలన్న ఆలోచనలో ఉన్నా, లేక శాంతిని స్థాపించడంలో ఆసక్తి చూపకపోయినా, అంతర్జాతీయంగా ఆంక్షలు విధించే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తోందని ఆయన తెలిపారు.
అయితే, చర్చల సమయంలో ఈ ఆంక్షల విషయాన్ని ప్రస్తావించడం దౌత్య ప్రక్రియను దెబ్బతీయొచ్చని కూడా ఆయన హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతిని తీసుకొచ్చేందుకు తాను కట్టుబడి ఉన్నానని ప్రకటించిన విషయాన్ని రూబియో గుర్తు చేశారు.
ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై దాడులను కొనసాగిస్తున్న రష్యాపై యూరోపియన్ యూనియన్ (EU), బ్రిటన్ తాజాగా కొత్త ఆంక్షలు విధించాయి.
వివరాలు
ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించడానికి రష్యా సిద్ధంగా ఉంది: పుతిన్
ఇదిలా ఉండగా,రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో టెలిఫోన్ ద్వారా సంభాషించారు.
ఈ సంభాషన అనంతరం పుతిన్ మాట్లాడుతూ.."ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించడానికి రష్యా సిద్ధంగా ఉంది.శాంతిస్థాపనకు మేము అంగీకరిస్తున్నాం.అయితే ఇందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి" అని వెల్లడించారు.
ప్రస్తుతం జరుగుతున్న చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.
ట్రంప్ ఈ ఫోన్‌కాల్ అనంతరం స్పందిస్తూ.. "ఇరు దేశాలు త్వరలో కాల్పుల విరమణ చర్చలను ప్రారంభిస్తాయని ఆశిస్తున్నాను" అని చెప్పారు.
అనంతరం ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొడిమిర్ జెలెన్‌స్కీతో కూడా మాట్లాడారు.
యుద్ధం ముగించే ఉద్దేశం రష్యాకు ఉన్నట్లు తనకు అనిపించడం లేదని అనంతరం జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.