Pakistan: : పాకిస్తాన్లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. అమెరికా పౌరులకు ఆ దేశ అడ్వైజరీ హెచ్చరికలు..
పాకిస్థాన్‌లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నాయకులు, మద్దతుదారులు చేపట్టిన ఆందోళనల కారణంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్‌లో శాంతి భద్రతల పరిస్థితి మరింత దిగజారిపోవడంతో, అక్కడ ఉన్న అమెరికా పౌరులకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్ 16వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, పెషావర్‌లోని సెరెనా హోటల్ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప, ఖైబర్ పఖ్తున్ ఖ్వా ప్రాంతాలకు వెళ్లే ప్రణాళికలను వాయిదా వేసుకోవాలని హెచ్చరించింది. మిలిటెంట్ల దాడుల ముప్పు ఉందని కూడా తెలిపారు.
10,000 మంది పీటీఐ మద్దతుదారుల అరెస్ట్
ఇదిలా ఉంటే, ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీటీఐ మద్దతుదారులు నిర్వహించిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణలలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ పోలీసులు సుమారు 10,000 మంది పీటీఐ మద్దతుదారులను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా, పాక్ ప్రభుత్వం ప్రజలను అదుపులోకి తీసుకోవడంలో కఠిన చర్యలు చేపట్టింది.