H-1B Visa Row: అమెరికాకు తెలివైన వ్యక్తులు కావాలి.. హెచ్1బీ వీసా చర్చపై ట్రంప్ వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో హెచ్1బీ వీసా (H-1B Visa) అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది.
అగ్రదేశానికి అధ్యక్షుడిగా నియమితుడైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
''మన దేశానికి సమర్థవంతులైన ప్రజలు కావాలి.తెలివిగలవారు అమెరికాకు రావాలి. మునుపెన్నడూ లేని స్థాయిలో మనకు ఉద్యోగాలు రాబోతున్నాయి''అని ఆయన కొత్త సంవత్సరం సందర్భంగా మీడియాతో చెప్పారు.
అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పుల కోసం ఏర్పాటైన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE)కి నేతలుగా ఉన్న ఎలాన్ మస్క్ (Elon Musk),వివేక్ రామస్వామి గతంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు.
యూఎస్ తక్కువ నైపుణ్యమున్న గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేస్తోంది కాబట్టి ఇతర దేశాల నుంచి నైపుణ్యం గలవారిని హెచ్1బీ వీసా ద్వారా ఆకర్షించవచ్చని పేర్కొన్నారు.
వివరాలు
మస్క్ కూడా హెచ్1బీ వీసా ద్వారా అమెరికాకు వలస
టాలెంట్ ఎక్కడ ఉన్నా, దాన్ని ఉపయోగించుకోవాలని,అమెరికా ఎప్పటికీ అగ్రస్థానంలో ఉండాలని వారు అభిప్రాయపడ్డారు.
మస్క్ కూడా హెచ్1బీ వీసా ద్వారా అమెరికాకు వలస వచ్చారు. అయితే ఈ వీసాలపై వ్యత్యాస అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సందర్భంగా హెచ్1బీ వీసా కార్యక్రమాన్ని రక్షించడానికి తాను యుద్ధానికి సిద్ధమని మస్క్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
మరోవైపు, తాను ఎల్లప్పుడూ హెచ్1బీ వీసాలకు అనుకూలంగా ఉంటానని ట్రంప్ మద్దతు ప్రకటించారు. ఇటీవల ఆయన మరోసారి అదే భావాన్ని పునరుద్ఘాటించారు.
వివరాలు
ఎఫ్-1 విద్యార్థి వీసాలను హెచ్1బీ వీసాలుగా మార్చుకోవడానికి అనువుగా కొత్త నిబంధనలు
బైడెన్ కార్యవర్గం ఇటీవల హెచ్1బీ వీసాల ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ, విదేశీ నిపుణులను నియమించడానికి అమెరికా కంపెనీలకు మరిన్ని అవకాశాలు కల్పించింది.
అలాగే, ఎఫ్-1 విద్యార్థి వీసాలను హెచ్1బీ వీసాలుగా మార్చుకోవడానికి అనువుగా కొత్త నిబంధనలు అమలు చేసింది.
ఈ మార్పులు లక్షల మంది భారతీయ వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూరుస్తాయని అంచనా. టెక్నాలజీ కంపెనీలు విదేశీ నైపుణ్యాన్ని ఈ వీసాల సాయంతో పెద్ద ఎత్తున నియమించుకుంటున్నాయి.
ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాలు ఈ వీసాల ద్వారా గణనీయమైన లాభాలు పొందుతున్నాయి.