USA: ట్రంప్ బాధ్యతలు చేపట్టకముందే.. న్యాయమూర్తులను నియమిస్తున్న డెమోక్రట్లు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే అధ్యక్షపదవిని స్వీకరించనున్నారు. ఈ నేపధ్యంలో అమెరికా కాంగ్రెస్‌లోని సెనెట్‌లో అనేక కీలక పరిణామాలు జరుగుతున్నాయి. డెమోక్రట్లు ప్రస్తుతం ఫెడరల్ న్యాయమూర్తుల నియామకాలపై చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. ఈ విషయంపై ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20న అధికార బాధ్యతలు చేపడతారు.ఈ సందర్భంలో, ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా పెర్రీని నియమించారు. ఈ నియామకంతో పాటు,సెనెట్ ఆమోదం కోసం ఎదురుచూసే 31 మంది జ్యూడిషియల్ నామినీలను కూడా బైడెన్ ప్రకటించారు.
ట్రంప్ అధ్యక్షుడు ఉన్న సమయంలో 234 న్యాయమూర్తులు
అధ్యక్షుడు నామినేట్ చేసిన న్యాయమూర్తులు సెనెట్ నుంచి ఆమోదం పొందితే, వారిని పదవి నుంచి తొలగించడం సాధ్యం కాదు. ఇది అమెరికా రాజ్యాంగం సెనెట్‌కు ఇచ్చిన ప్రత్యేక అధికారంగా నిలుస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న డెమోక్రట్లు, తమ పదవీ కాలం ముగిసేలోగా ఈ నియామకాలను పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడు ఉన్న సమయంలో 234 న్యాయమూర్తులను నియమించారు. అదే సమయంలో, జో బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కేతంజీ బ్రౌన్ జాక్సన్‌తో సహా 213 మంది జ్యూడిషియల్ నామినీలను నియమించినట్లు సెనెట్ ధ్రువీకరించింది. ఇందులో సుమారు 50%మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో, మిగిలిన నామినీల నియామకాలను కూడా వేగంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం.
నియామకాలను వెంటనే నిలిపివేయాలని సెనెట్‌కు పిలుపు
అయితే, బైడెన్ నామినీల నియామకాలను డొనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులు, ముఖ్యంగా ఎలాన్ మస్క్, తీవ్రంగా విమర్శించారు. ఈ నియామకాలను వెంటనే నిలిపివేయాలని సెనెట్‌కు పిలుపునిచ్చారు. తమ నియామకాలతో డెమోక్రట్లు ముందుకుసాగాలని చూస్తున్నారని ట్రంప్ విమర్శించారు.