Loading...
Bangladesh: బంగ్లాదేశ్‌లో బిగ్ ట్విస్ట్.. హసీనా రీఎంట్రీతో ప్రభుత్వానికి కొత్త తలనొప్పి!
బంగ్లాదేశ్‌లో బిగ్ ట్విస్ట్.. హసీనా రీఎంట్రీతో ప్రభుత్వానికి కొత్త తలనొప్పి!

Bangladesh: బంగ్లాదేశ్‌లో బిగ్ ట్విస్ట్.. హసీనా రీఎంట్రీతో ప్రభుత్వానికి కొత్త తలనొప్పి!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2026
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారుతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వస్తానని ప్రకటించడంతో అక్కడ రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు వస్తానని ఆమె ప్రకటించడంతో అవామీ లీగ్ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. ముఖ్యంగా హసీనా సొంత జిల్లా గోపాల్‌గంజ్‌లో ఆదివారం (నవంబర్ 15)వందలాది మంది కార్యకర్తలు ఆయుధాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసుల బారికేడ్లను ధ్వంసం చేసి, సాయుధ పోలీసు వాహనానికి నిప్పంటించారు. పోలీసు అవుట్‌పోస్టుపై దాడి చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. పరిస్థితి మరింత దిగజారకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీగా భద్రతా బలగాలను మోహరించడంతో పాటు జిల్లా కలెక్టర్,పోలీసు సూపరింటెండెంట్‌లను బదిలీ చేసింది.

వివరాలు 

భద్రతా విధులకు సుమారు 1,350 మంది పోలీసులు 

గోపాల్‌గంజ్‌లో అవామీ లీగ్ కార్యకర్తల నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.

ఇప్పటికే ఆరు ప్లాటూన్ల బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) బలగాలను రంగంలోకి దించింది.

స్థానిక నివేదికల ప్రకారం సుమారు 1,350 మంది పోలీసులను కూడా భద్రతా విధులకు కేటాయించింది.

ఆందోళనకారులు పోలీసు వాహనంతో పాటు పోలీసు బాక్స్‌ను, ఓ స్మారక చిహ్నాన్ని ధ్వంసం చేశారు.

హాదీ స్క్వేర్ వద్ద ఉన్న నేమ్‌ప్లేట్‌ను తొలగించారు. గతంలో మూసివేసిన అవామీ లీగ్ జిల్లా కార్యాలయాన్ని తిరిగి తెరిచారు.

మరోవైపు రోడ్లపై టైర్లను తగలబెట్టి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించారు.

వివరాలు 

భారత్ నిర్ణయంపైనే ఉత్కంఠ

స్వదేశానికి తిరిగి వస్తానని ప్రకటించడమే కాకుండా షేక్ హసీనా తాజాగా మరో కీలక చర్యకు దిగారు.

ప్రస్తుతం భారత్‌లో ఉంటున్న ఆమె.. బంగ్లాదేశ్ హైకమిషన్‌కు కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు (ఎన్‌ఐడీ) జారీ చేయాలని కోరుతూ దరఖాస్తు పంపించారు.

ఈ మేరకు లండన్‌కు చెందిన మ్యాట్రిక్స్ ఛాంబర్స్ న్యాయ సంస్థ బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయానికి లేఖ రాసింది.

డిసెంబర్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ స్వదేశానికి తిరిగి వస్తానని హసీనా స్పష్టం చేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ఇరుదేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం చర్యలు

అయితే ఆమెకు కొత్త పాస్‌పోర్టు,జాతీయ గుర్తింపు కార్డు జారీ చేసే చట్టపరమైన అర్హత ఉందా?అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు బంగ్లాదేశ్ హోంమంత్రి వెల్లడించారు.

ఇదిలా ఉంటే,హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌పై ఒత్తిడి పెంచుతోంది.

తమ దేశంలో ఆమెకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతోంది.

హసీనా అప్పగింతకు సంబంధించి అవసరమైన న్యాయపరమైన లాంఛనాలు పూర్తయ్యాయని బంగ్లాదేశ్ న్యాయశాఖమంత్రి ఇప్పటికే ప్రకటించారు.

అయితే భారత్ విదేశాంగ శాఖ మాత్రం ఇది న్యాయపరమైన అంశమని,సంబంధిత నిబంధనల ప్రకారం పరిశీలిస్తామని తెలిపింది.

ఇప్పటివరకు హసీనా అప్పగింతపై భారత్ ఎలాంటి తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు.

దీంతో ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

ADVERTISEMENT

వివరాలు 

ఉద్రిక్తతలకు మరో కారణం

గోపాల్‌గంజ్‌లో ఆదివారం అవామీ లీగ్ కార్యకర్తల ఆందోళనలు ప్రారంభం కావడానికి ముందు మరో ఘటన చోటుచేసుకుంది.

తుంగిపారాలో అధికార బీఎన్‌పీకి చెందిన రెండు కార్యాలయాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు.

దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వర్గాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

ఈ పరిణామాలపై ప్రధాని తారిఖ్ రెహ్మాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు అవసరమైతే మరిన్ని భద్రతా బలగాలను మోహరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

వివరాలు 

బంగ్లాదేశ్‌లో అసలు ఏం జరుగుతోంది?

2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి.

అప్పటి నుంచి అవామీ లీగ్ రాజకీయ కార్యకలాపాలపై నిషేధం విధించారు.

2026 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ పోటీకి దూరంగా ఉంది. దీంతో బీఎన్‌పీ అధికారంలోకి వచ్చి తారిఖ్ రెహ్మాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజకీయాలను మూడు కీలక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.

ఒకవైపు షేక్ హసీనా తిరిగి స్వదేశానికి రావాలన్న ప్రయత్నాలు,మరోవైపు ఆమెకు విధించిన మరణశిక్ష,ఇంకోవైపు ఆమెను అప్పగించాలంటూ భారత్‌కు పంపిన అభ్యర్థన.. ఇవన్నీ అక్కడి రాజకీయాలను మరింత సంక్లిష్టంగా మార్చాయి.

హసీనా తిరిగి వస్తే పరిస్థితులు ఎలా మారతాయన్న ప్రశ్న ఇప్పుడు బంగ్లాదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న అవామీ లీగ్ కార్యకర్తలు

ADVERTISEMENT