US election FAQs: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ రోజు ఎప్పుడు? ఫలితాలు ఎప్పుడు వెలువడతాయి?
నాలుగేళ్లకోసారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. అమెరికా వ్యాప్తంగా జరుగబోయే ఓటింగ్ ప్రక్రియకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అధ్యక్ష అభ్యర్థుల బరిలో మొత్తం ఆరుగురు ఉన్నప్పటికీ, ప్రధానంగా పోటీ మాత్రం ఇద్దరి మధ్యే సాగుతోంది. డెమొక్రాటిక్ పార్టీ నుంచి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ ప్రధాన పోటీదారులుగా నిలిచారు. ఇంకా నలుగురు స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నప్పటికీ, ప్రధానంగా వారిని రేసులో గట్టిగా పరిగణించడం లేదు. విశ్లేషకులు మాత్రం ఈ ఎన్నికలు భిన్నమైన ఫలితాలు అందిస్తాయని భావిస్తున్నారు.
2024 ఓటింగ్ రోజు ఎప్పుడు?
ఎన్నికల రోజుగా పిలువబడే నవంబర్ 5న US ఎన్నికలు అధికారికంగా జరుగుతాయి. అయినప్పటికీ, USలోని దాదాపు ప్రతి రాష్ట్రం ముందస్తు ఓటింగ్‌ని అనుమతిస్తుంది. నవంబర్ 5కి ముందు గత వారం నాటికి 75 మిలియన్లకు పైగా అమెరికన్లు ఇప్పటికే తమ ఓటు వేశారు.
విజేతను ఎప్పుడు ప్రకటిస్తారు?
అమెరికాలో ఎన్నికలు బ్యాలెట్ విధానం ద్వారా నిర్వహిస్తారు. పోలింగ్ ముగిసిన రోజున సాయంత్రం నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2020 ఎన్నికల్లో ఓట్లను లెక్కించడానికి కొన్ని రోజులు పట్టడంతో ఫలితాల ప్రకటనలో ఆలస్యం చోటుచేసుకుంది. ఎలక్టోరల్ కాలేజీలో ఎంపికైన ప్రతినిధులు (ఎలక్టర్లు) డిసెంబర్ 17న సమావేశమై అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.
అయితే తుది ఎన్నికల ఫలితాలు ఎప్పుడు తెలుస్తాయి?
అమెరికాలో అధికారంలోకి రావడం కోసం స్వింగ్ రాష్ట్రాల్లో మెజారిటీ సాధించడం చాలా ముఖ్యం. రెడ్ స్టేట్స్ (రిపబ్లికన్) లో ట్రంప్ 226 స్థానాలు, బ్లూ స్టేట్స్ (డెమొక్రటిక్) లో కమల 219 స్థానాలు సాధిస్తారని అంచనా. అయితే, గెలవడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లు. దీని కోసం స్వింగ్ రాష్ట్రాల్లో కమలకి 44, ట్రంప్ కి 51 సీట్లు అవసరం. దీంతో ట్రంప్, కమల ఈ కీలక రాష్ట్రాల్లో చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. గత నెలాఖరుకు కమలకి అనుకూలంగా ఉన్న కొన్ని స్వింగ్ రాష్ట్రాలు ఇప్పుడు ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి.
స్వింగ్ రాష్ట్రాల్లో 48%ఓట్లు ట్రంప్ వైపుకు
అయితే, ట్రంప్ సాధించే మెజారిటీ తక్కువగా ఉంటుందని కూడా స్పష్టం చేస్తున్నాయి.గత నెలాఖరులో,స్వింగ్ రాష్ట్రాల్లో కమలకి 44%,ట్రంప్ కి 43% ఓట్లు వస్తాయని అంచనా. కానీ ప్రస్తుతం కమల 1.8% తక్కువగా ఉన్నట్లు అట్లాస్-ఇంటెల్ సర్వేలు చెబుతున్నాయి. ఈ నెల 1,2 తేదీల్లో సర్వేలు చేయగా,వాటి ప్రకారం స్వింగ్ రాష్ట్రాల్లో 48%ఓట్లు ట్రంప్ వైపుకు,46.2% ఓట్లు కమల వైపుకు వెళ్ళే అవకాశం ఉంది. మరో సర్వేలో కూడా రిపబ్లికన్లకు స్వల్ప ఆధిక్యం ఉందని తేలింది.నెవడాలో ట్రంప్ 51.4%, కమల 45% ఓట్లు సాధించబోతున్నారని, అలాగే నార్త్ కరోలినాలో ట్రంప్ 50.4%ఓట్లతో ముందంజలో ఉన్నట్లు వివరించింది. కానీ పెన్సిల్వేనియాలో డెమొక్రాట్లకు స్వల్ప ఇబ్బందులు ఉన్నట్లు చెప్పబడింది. 1948 నుంచి పెన్సిల్వేనియా డెమొక్రాట్లకు కీలకమైన రాష్ట్రం.
ఫలితాలు ఎప్పుడు?
ఈ మంగళవారం (5వ తేదీ) ఎన్నికలు జరుగనున్నాయి. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. భారత్‌లో ఉన్నట్లుగా, అమెరికాలో దేశమంతటికీ ఒకే ఎన్నికల సంఘం ఉండదు. అమెరికాలో సమాఖ్య వ్యవస్థలో భాగంగా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక ఎన్నికల ఏజెన్సీలు ఉంటాయి, ఇవే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహిస్తాయి. సాధారణంగా, చాలా సందర్భాల్లో ఎన్నికల ఫలితాలు ఆ రోజు రాత్రి లేదా మరుసటి రోజు మధ్యాహ్నానికి అందుబాటులోకి వస్తాయి. కానీ, ఈ సారి పూర్తిస్థాయి ఫలితాలు ఈ నెల 11వ తేదీ వరకు అందుతాయని అంచనా. కొత్త అధ్యక్షుడు వచ్చే ఏడాది జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.