Page Loader
మానవ హక్కులపై మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధించడం సరికాదు: వైట్‌హౌస్
మానవ హక్కులపై మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధించడం సరికాదు: వైట్‌హౌస్

మానవ హక్కులపై మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధించడం సరికాదు: వైట్‌హౌస్

వ్రాసిన వారు Stalin
Jun 27, 2023
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా పర్యటన సందర్భంగా వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రశ్న వేసిన జర్నలిస్టును సోషల్ మీడియాలో వేధించడాన్ని అగ్రరాజ్యం ఖండించింది. జర్నలిస్టును వేధించడం ఆమోదయోగ్యం కాదని, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని వైట్‌హౌస్ పేర్కొంది. భారతదేశంలోని కొందరు వ్యక్తుల నుంచి సబ్రీనా సిద్ధిఖీ ఆన్‌లైన్ వేధింపులకు గురయ్యారని, వారిలో కొందరు రాజకీయ నాయకులు కూడా ఉన్నారని, దీనిపై వైట్‌హౌస్ స్పందించాలని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక కెల్లీ ఓడొనెల్ డిమాండ్ చేశారు. దీనిపై వైట్‌హౌస్ స్పందించింది. ఆ వేధింపుల నివేదికల గురించి తమ దృష్టికి వచ్చినట్లు వైట్‌హౌస్ జాన్ కిర్బీ పేర్కొన్నారు. జర్నలిస్టులపై ఎక్కడ ఎలాంటి వేధింపులు జరిగినా తాము కచ్చితంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం అన్నారు.

వైట్‌హౌస్

ప్రధాని మోదీకి జర్నలిస్టు సిద్ధిఖీ వేసిన ప్రశ్న ఇదే

భారత్‌లో ముస్లింలు, మైనారిటీల హక్కులను కాపాడటానికి, వాక్‌స్వేచ్ఛను మెరుగుపర్చేందుకు మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ప్రధాని మోదీకి వాల్ స్ట్రీట్ జర్నల్ జర్నలిస్టు సబ్రీనా సిద్ధిఖీ ప్రశ్న వేశారు. జూన్ 23న వైట్‌హౌస్‌లో బైడెన్‌తో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ ప్రశ్న వేశారు. దీనికి మోదీ సమాధానం కూడా చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని భారత్ శ్వాసిస్తోందని మోదీ అన్నారు. భారతీయుల సిరల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రవహిస్తుందని చెప్పారు. మానవ విలువలు, మానవ హక్కులు లేకపోతే ప్రజాస్వామ్యం లేదని మోదీ వెల్లడించారు. మనం ప్రజాస్వామ్యలో జీవిస్తున్నప్పుడు వివక్ష అనే ప్రశ్నకు తావులేదని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. మతం, కులం, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సౌకర్యాలు లభిస్తాయని మోదీ సమాధానం చెప్పారు.

వైట్‌హౌస్

భారత్‌లో ఆన్‌లైన్ వేధింపులపై స్పందించిన జర్నలిస్టు సిద్ధిఖీ

ముస్లింలు, ఇతర మైనారిటీల హక్కులను 'రక్షించడానికి' తీసుకుంటున్న చర్యలపై ప్రధాని ధీటైన సమాధానం చెప్పి జర్నలిస్టు వేసిన ప్రశ్నను నిర్వీర్యం చేశారని బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. ఇది టూల్‌కిట్ ముఠాకు ఎదురుదెబ్బగా అభివర్ణించారు. అయితే జర్నలిస్టు సిద్ధిఖీ ఆన్‌లైన్‌లో తనపై వచ్చిన విమర్శలపై స్పందించారు. ఆమె టీమ్ ఇండియా టీ-షర్ట్ ధరించి, భారతదేశంలో జన్మించిన తన తండ్రితో ఇండియా క్రికెట్ జట్టుకు మద్దతు తెలుపుతున్న ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. కొందరు తన వ్యక్తిగత నేపథ్యాన్ని టార్గెట్ చేశారని, అందుకే వారి కోసం ఈ పూర్తి చిత్రాన్ని షేర్ చేస్తున్నట్లు సిద్ధిఖీ ట్వీట్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియా చేసిన ట్వీట్ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వాల్ స్ట్రీట్ జర్నల్ జర్నలిస్టు సబ్రీనా సిద్ధిఖీ చేసిన ట్వీట్