WHO: బాంబు దాడి నుండి తృటిలో తప్పించుకున్నడబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ (Tedros Adhanom) తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. యెమెన్‌లోని సనా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కే సమయంలో వైమానిక బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది.
విమానం ఎక్కే సమయంలో బాంబు దాడి
''ఐక్యరాజ్యసమితి ఉద్యోగులతో కలిసి ఖైదీల విడుదలపై చర్చలు జరపడానికి, యెమెన్‌లో ఆరోగ్య పరిస్థితులు, మానవతా అంశాలపై అంచనాలు చేసేందుకు అక్కడికి వెళ్లాను. ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేసాము. సనాలో విమానం ఎక్కే సమయంలో బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. మా విమాన సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. దాడి జరిగిన ప్రదేశానికి మా నుంచి కొన్ని మీటర్ల దూరమే ఉంది. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను'' అని టెడ్రోస్ అధానోమ్ ఎక్స్ వేదికలో పేర్కొన్నారు.
యెమెన్, ఇజ్రాయెల్‌ల మధ్య దాడులు తీవ్రతరం
ఈ దాడిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ (Antonio Guterres) ఖండిస్తూ, ''యెమెన్, ఇజ్రాయెల్‌ల మధ్య దాడులు తీవ్రతరం అవుతున్నాయి. సనా అంతర్జాతీయ విమానాశ్రయం, ఎర్ర సముద్రం పరిసర ప్రాంతాలు, నౌకాశ్రయాలు, విద్యుత్ కేంద్రాలపై వైమానిక దాడులు ఆందోళనకరంగా ఉన్నాయి. పౌరులపై, మానవతా కార్మికులపై దాడులు చేయకూడదు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం అత్యవసరం'' అని వ్యాఖ్యానించారు.
హూతీలపై ఇజ్రాయెల్ లక్ష్యం
గురువారం ఇజ్రాయెల్ యెమెన్‌లోని సనా విమానాశ్రయం, నౌకాశ్రయాలు, విద్యుత్ కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. హమాస్, హెజ్‌బొల్లా, సిరియాలోని అసద్ ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాయో హూతీలు కూడా అదే నేర్చుకుంటారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యల అనంతరం ఈ దాడులు జరిగాయి. గత కొన్ని రోజులుగా హూతీలు ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు నిర్వహిస్తుండగా, ఇజ్రాయెల్ తమ లక్ష్యాన్ని హూతీలపై కేంద్రీకరించింది. తాజా దాడులను ఇతర సైనికాధికారులతో కలిసి నెతన్యాహు పర్యవేక్షించారని ఇజ్రాయెల్ ప్రభుత్వం పేర్కొంది.