Brunei: బ్రూనైలో మోదీకి స్వాగతం పలికిన.. 7000+ లగ్జరీ కార్లు ఉన్న బ్రూనై సుల్తాన్ ఎవరు..?
భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై పర్యటనలో ఉన్నారు. బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బల్కియా ఆహ్వానం మేరకు మోదీ ఇక్కడికి చేరుకున్నారు. నరేంద్ర మోదీ బ్రూనై పర్యటన చేసిన మొదటి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు. క్రౌన్ ప్రిన్స్ అల్-ముహతాది ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. భారత ప్రధానిగా తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి మూడు రోజులపాటు బ్రూనై, సింగపూర్‌లో పర్యటించనున్నారు. హసనల్ బోల్కియా ప్రపంచవ్యాప్తంగా విలాసవంతమైన జీవితానికి పేరుపొందిన సుల్తాన్. అతనికి ఎన్నో అరుదైన రికార్డులు ఉన్నాయి. ఒకసారి జుట్టును కత్తిరించుకోవడానికే లక్షల రూపాయలు వెచ్చిస్తారు. బ్రూనై రాజకుటుంబం విశేషాలు ఇప్పుడు తెలుసుకొందాం.
సంపద సుమారు 40 బిలియన్ డాలర్లు
క్వీన్ ఎలిజిబెత్ 2 తర్వాత, ప్రపంచంలో అత్యధిక కాలం పదవిలో ఉన్న పాలకుడిగా హసనల్ నిలిచారు. సుల్తాన్ పూర్తిగా పాశ్చాత్య విలాస శైలిలో జీవిస్తున్నారు. వారి సంపద సుమారు 40 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. ప్రధానంగా చమురు, గ్యాస్ వనరుల నుంచి వచ్చిన ఆదాయం రాజకుటుంబానికి ప్రధాన ఆదాయవనరు. 1946లో జన్మించిన సుల్తాన్ విద్యాభ్యాసం విదేశాల్లో జరిగింది. 19 ఏళ్ల వయస్సులో తన కజిన్ పెంగ్రియన్ అనక సలేహ్‌తో పెద్దల ద్వారా వివాహం జరిగింది. తరువాత బ్రిటన్‌లోని రాయల్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పూర్తిచేశారు. 1968లో తండ్రి పదవి నుంచి దిగిపోవడంతో, సుల్తాన్ రాజుగా అధికారం చేపట్టారు.
లండన్‌లో హెయిర్ కట్ కోసం..
బ్రూనై రాజు హెయిర్ కట్ కోసం ప్రత్యేకంగా లండన్‌కు ప్రయాణిస్తారు. లండన్‌లోని ది డోర్‌చెస్టర్ హోటల్ వద్ద ఉన్న ఒక ప్రఖ్యాత బార్బర్ ఆయనకి చాలా ఇష్టం. దాదాపు 20 వేల డాలర్లను హెయిర్ కట్ కోసం వెచ్చించేవారు. పెయింటింగ్స్ పై అభిమానం.. సుల్తాన్ పెయింటింగ్స్ అంటే అత్యంత ఇష్టపడతారు. ఒకసారి పారిస్‌లో రినోయిర్ వేసిన చిత్రాన్ని 70 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.
1,700 గదుల రాజభవనం..
బ్రూనై రాజభవనం ప్రపంచంలోనే అత్యంత పెద్ద భవనాలలో ఒకటి. ఇందులో 1,700 గదులు, 257 బాత్‌రూమ్‌లు, ఐదు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్యాలెస్‌గా గిన్నీస్ రికార్డుకు ఎక్కింది. 7,000 లగ్జరీ కార్లు.. సుల్తాన్ ప్యాలెస్‌లో దాదాపు 7,000 లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటిలో 600 రోల్స్ రాయిస్ కార్లు, 450 ఫెరారీలు, 380 బెంట్లీ కార్లతో సహా, అనేక విలాసవంతమైన వాహనాలు కలిగివున్నారు.