Loading...
Russia-WHO: రష్యాలో ల్యాబ్‌ ఉద్యోగి మృతి.. ప్లేగు అనుమానాలపై WHO ఆరా
రష్యాలో ల్యాబ్‌ ఉద్యోగి మృతి.. ప్లేగు అనుమానాలపై WHO ఆరా

Russia-WHO: రష్యాలో ల్యాబ్‌ ఉద్యోగి మృతి.. ప్లేగు అనుమానాలపై WHO ఆరా

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2026
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాలోని సైబీరియాలో ల్యాబ్‌ ఉద్యోగి అనుమానాస్పద మృతి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. 28 ఏళ్ల దర్యా షిపిలోవా న్యూమోనియాతో మరణించగా.. ఆమెకు వ్యాధి ఎలా సోకిందనే విషయం ఇప్పటికీ స్పష్టంగా తేలలేదు. ఆమె పనిచేసింది ప్లేగు వంటి ప్రమాదకర వ్యాధికారకాలను అధ్యయనం చేసే సంస్థలో కావడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రష్యా నుంచి పూర్తి వివరాలను కోరింది.

వివరాలు 

వ్యాధికారకంపై పూర్తి వివరాలు కావాలి

WHO డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రేయేసస్‌ మాట్లాడుతూ.. దర్యా షిపిలోవాకు న్యూమోనియా రావడానికి కారణమైన వ్యాధికారక సూక్ష్మజీవి ఏదో, ఆమె అనారోగ్యానికి దారితీసిన పరిస్థితులు ఏమిటో స్పష్టంగా తెలియజేయాలని రష్యాను కోరినట్లు తెలిపారు.

మరో ల్యాబ్‌ ఉద్యోగికి కూడా కారణం తెలియని న్యూమోనియా సోకినట్లు మీడియాలో వచ్చిన వార్తలపైనా వివరాలు ఇవ్వాలని WHO కోరింది.

అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం ఇలాంటి ఘటనలకు సంబంధించిన సమాచారాన్ని సమయానుకూలంగా, సంపూర్ణంగా, పారదర్శకంగా పంచుకోవడం ఎంతో ముఖ్యమని టెడ్రోస్‌ పేర్కొన్నారు.

వివరాలు 

ప్లేగు కేసులు లేవన్న రష్యా

మృతురాలితో సంబంధం ఉన్న వ్యక్తుల్లో ఇప్పటివరకు ఒక్క ప్లేగు కేసు కూడా గుర్తించలేదని రష్యా ఆరోగ్య పర్యవేక్షణ సంస్థ రోస్పోట్రెబ్నాడ్జోర్‌ వెల్లడించింది.

తొలుత సుమారు 200 మందిని క్వారంటైన్‌, వైద్య పర్యవేక్షణలో ఉంచగా.. వారిలో 60 శాతం మందిని ఇప్పటికే విడుదల చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

వందల సంఖ్యలో నిర్వహించిన పరీక్షల్లో ప్రమాదకర వ్యాధికారకాలు గుర్తించలేదని రోస్పోట్రెబ్నాడ్జోర్‌ పేర్కొంది.

దీంతో ప్లేగు వ్యాప్తిపై వచ్చిన అనుమానాలకు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లభించలేదు.

ADVERTISEMENT

వివరాలు 

మీడియా కథనాలపై క్రెమ్లిన్‌ స్పందన

WHO మరింత సమాచారం కోరడంపై క్రెమ్లిన్‌ కూడా స్పందించింది.

రష్యా వద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని నిర్ణీత విధానాల ప్రకారం ఇప్పటికే WHOకు అందించినట్లు తెలిపింది.

అదే సమయంలో ఈ ఘటనపై మీడియాలో ప్రచారం అవుతున్న కొన్ని కథనాలు వాస్తవాలకు విరుద్ధమైనవని, వాటిని తప్పుడు సమాచారంగా పరిగణిస్తున్నామని క్రెమ్లిన్‌ పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

ఇంతకీ ఏం జరిగింది?

దర్యా షిపిలోవా సైబీరియాలోని ఇర్కుట్స్క్‌ యాంటీ-ప్లేగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగిగా పనిచేశారు.

అక్టోబర్‌ 2న ఆమె మృతి చెందారు. తెలియని కారణంతో వచ్చిన న్యూమోనియా కారణంగానే ఆమె చనిపోయినట్లు రష్యా అధికారులు వెల్లడించారు.

అయితే ఆమెకు ప్లేగు సోకినట్లు మాత్రం అధికారికంగా నిర్ధారించలేదు.

ఆమె పనిచేసిన సంస్థలో ప్లేగుతో పాటు ఇతర ప్రమాదకర వ్యాధికారకాలను అధ్యయనం చేస్తుండటంతో ఈ ఘటనపై అనుమానాలు తలెత్తాయి.

వివరాలు 

ఇంతకీ ఏం జరిగింది?

ల్యాబ్‌లో ప్రమాదం జరిగిందా? ప్లేగు సోకిందా? అనే చర్చ రష్యా మీడియా, సోషల్‌ మీడియాలో మొదలైంది. ల్యాబ్‌లో టెస్ట్‌ట్యూబ్‌ పగిలిందనే కథనాలు కూడా వెలువడ్డాయి.

అయితే ల్యాబ్‌లో ఎలాంటి ప్రమాదం జరగలేదని రష్యా అధికారులు స్పష్టం చేశారు.

ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా దర్యా షిపిలోవాతో సంబంధం ఉన్న సుమారు 200 మందిని క్వారంటైన్‌ లేదా వైద్య పర్యవేక్షణలో ఉంచారు.

వారి పరీక్షల్లో ఇప్పటివరకు ప్లేగు లేదా ఇతర ప్రమాదకర వ్యాధికారకాలకు సంబంధించిన ఆధారాలు కనిపించలేదని రష్యా ఆరోగ్య నియంత్రణ సంస్థ వెల్లడించింది.

ADVERTISEMENT