Canada PM: కెనడా కొత్త ప్రధాని ఎవరు..? కొత్త ప్రధాని ఎంపికకు నేడే ఓటింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) తన పదవి నుంచి వైదొలగనున్నట్లు ఈ జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు అధికార లిబరల్ పార్టీ (Liberal Party of Canada) సిద్ధమైంది. ఈ రోజు (మార్చి 9) పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటింగ్ నిర్వహించనుంది.
ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు నలుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో ఈ రేసు ఉత్కంఠ రేపుతోంది.
Details
పార్టీ అధినేత పదవికి నలుగురు బరిలో
లిబరల్ పార్టీ నేతగా ఎంపికకు మార్క్ కార్నీ, క్రిస్టియా ఫ్రీలాండ్, కరినా గౌల్డ్, ఫ్రాంక్ బేలిస్‌లు పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా మార్క్ కార్నీ, క్రిస్టియా ఫ్రీలాండ్‌ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.
అయితే, మార్క్ కార్నీ ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
మార్క్ కార్నీ గతంలో బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్‌గా, అనంతరం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్‌గా పనిచేశారు.
మరోవైపు, క్రిస్టియా ఫ్రీలాండ్ ట్రూడో ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
అయితే, గత డిసెంబర్‌లో ఆమె రాజీనామా చేయడం, ట్రూడోపై ఆమె రాసిన లేఖ ఆయన వైదొలగడానికి కారణమయ్యిందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
Details
అమెరికా సుంకాల సవాళ్లు
కెనడా ప్రస్తుతం అమెరికా నుండి సుంకాల అంశంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం కెనడా ఆర్థిక వ్యవస్థపై పడి, కొత్త ప్రధాని ముందు కీలక సవాళ్లుగా నిలిచే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీ నాయకత్వానికి పోటీ పడుతున్న అభ్యర్థులు తమదైన వ్యూహాలను ముందుకు తెస్తున్నారు.
ఈ ఎన్నికలో సుమారు 1.40 లక్షల మంది ఓటర్లు పాల్గొననున్నారు. గెలిచిన అభ్యర్థిని గవర్నర్ జనరల్ అధికారికంగా కెనడా ప్రధానిగా నియమించనున్నారు. కొత్త నేత దేశాన్ని ఎలా నడిపిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.