Mexico:ఎందుకు భయపడాలి ?.. డొనాల్డ్ ట్రంప్‌పై మెక్సికో అధ్యక్షురాలు కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పరస్పర సుంకాలు, వలసదారుల బహిష్కరణపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ (Claudia Sheinbaum) తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో "ట్రంప్ హెచ్చరికలకు భయపడుతున్నారా?" అనే ప్రశ్నకు ఆమె తేల్చి చెప్పారు.
ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు తాను భయపడేది లేదని షేన్‌బామ్ స్పష్టంచేశారు.
డ్రగ్ ముఠాలను అరికట్టేందుకు మిలిటరీ జోక్యం, వలసదారుల బహిష్కరణ, పరస్పర సుంకాల వంటి ట్రంప్ చర్యలు తమ దేశాన్ని ప్రభావితం చేయలేవని వ్యాఖ్యానించారు.
తనకు మెక్సికన్ ప్రజల పూర్తి మద్దతు ఉందని, మెక్సికో సార్వభౌమత్వాన్ని కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
వివరాలు
మెక్సికోపై 25% సుంకాలు
ఇదిలా ఉండగా, మెక్సికోపై ట్రంప్ విధించిన 25% సుంకాలను తాత్కాలికంగా నెల రోజుల పాటు నిలిపివేయడం తెలిసిందే.
తాజా పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల అధికారులు ఈ వారం వాషింగ్టన్‌లో భేటీ కానున్నారు.
అమెరికాలోకి ఫెంటానిల్ డ్రగ్ అక్రమ రవాణా, వలసదారుల చొరబాట్లను అడ్డుకోవడంలో కెనడా, మెక్సికోలు విఫలమయ్యాయని ట్రంప్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఆ దేశాలపై 25% సుంకాలు విధిస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. అధ్యక్ష పదవిని చేపట్టిన కొద్ది రోజుల్లోనే సుంకాల విధింపుపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.
వివరాలు
మెక్సికో ఉత్తర సరిహద్దులో 10,000 మంది సైన్యం
ట్రంప్ ప్రకటనకు ప్రతిస్పందనగా కెనడా, మెక్సికోలు అమెరికా దిగుమతులపై సుంకాలు విధించేందుకు సిద్ధమయ్యాయి.
అనంతరం, ట్రంప్ నెల రోజుల పాటు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, మెక్సికో తన ఉత్తర సరిహద్దులో 10,000 మంది సైన్యాన్ని మోహరించింది.
ముఖ్యంగా ఫెంటానిల్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అక్రమ వలసదారుల చొరబాట్లను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది.
అయితే, ఇదే సమయంలో ట్రంప్ పరస్పర సుంకాల విధింపునకు సంబంధించి తాజా ప్రకటన చేశారు.