
Asim Munir: సింధు నదిపై భారత్ ఆనకట్టను నిర్మిస్తే.. క్షిపణులతో ధ్వంసం చేస్తాం: అసీం మునీర్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ మరోసారి అణుబాంబు బెదిరింపులు చేశారు. అమెరికాలోని టాంపా నగరంలో వ్యాపారవేత్త, గౌరవ కాన్సుల్ ఆద్నాన్ అసాద్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్న మునీర్ మాట్లాడుతూ, "మేము అణ్వాయుధ దేశం. మమ్మల్ని కూల్చేయాలనే పరిస్థితి వస్తే, మేము ప్రపంచంలో సగం దేశాలను మాతో పాటు తీసుకుపోతాం" అని హెచ్చరించారు. అమెరికా భూభాగం నుంచి మూడో దేశానికి అణు బెదిరింపు చేసిన మొదటి ఘటన ఇదే అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ అనంతరం, రెండు నెలల్లో రెండోసారి అమెరికా పర్యటనకు వచ్చిన మునీర్, సింధు నదిపై భారత్ కట్టే ఆనకట్టల అంశాన్ని ప్రస్తావించారు.
వివరాలు
పాకిస్థాన్ ను గులకరాళ్లతో నిండిన చెత్త ట్రక్‌తో పోల్చారు
"భారత్ డ్యామ్ కడితే, దాన్ని పదికి పైగా క్షిపణులతో ధ్వంసం చేస్తాం.సింధు నది భారత కుటుంబ ఆస్తి కాదు. మా దగ్గర క్షిపణుల కొరత లేదు" అని ఆయన స్పష్టం చేశారు. అమెరికా నేలపై నుంచే భారత్‌ను విమర్శించిన మునీర్, పాకిస్తాన్‌లో ఉన్న చమురు, ఖనిజ సంపదలను పొగిడుతూ, రెండు దేశాల స్థాయిని పోల్చే ప్రయత్నం చేశారు. "భారత్ హైవేపై వెళ్తున్న మెర్సిడెస్ కారు లాంటిది. పాకిస్తాన్ మాత్రం రాళ్లతో నిండిన డంప్ ట్రక్. ఆ ట్రక్ కారును ఢీకొడితే ఎవరు నష్టపోతారు?" అని వ్యాఖ్యానించారు. భారత్ తనను తాను విశ్వగురువుగా చూపించాలని కోరుకుంటుందని.. కానీ వాస్తవానికి దీనికి దూరంగా ఉందని మునీర్ అన్నారు.
వివరాలు
కురిల్లా నాయకత్వాన్నిప్రశంసించిన మునీర్
కెనడాలో సిక్కు నేత హత్య, ఖతార్‌లో ఎనిమిది మంది భారత నౌకాదళ అధికారుల అరెస్ట్, కుల్‌భూషణ్ జాధవ్ కేసు వంటి అంశాలను ప్రస్తావిస్తూ, ఇవన్నీ భారత అంతర్జాతీయ ఉగ్రవాద ప్రమేయానికి సాక్ష్యాలని మునీర్ ఆరోపించారు. పర్యటనలో భాగంగా మునీర్ అమెరికా రాజకీయ, సైనిక ప్రముఖులతో పాటు పాకిస్తానీ ప్రవాసులతో సమావేశమయ్యారు. టాంపాలో అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధిపతి జనరల్ మైఖేల్ కురిల్లా రిటైర్మెంట్ కార్యక్రమం, కొత్త అధిపతి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ పదవీ స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యారు అమెరికా-పాకిస్తాన్ సైనిక సంబంధాల బలోపేతానికి కురిల్లా చేసిన కృషిని మునీర్ ప్రశంసించగా, కూపర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
వివరాలు
గత రెండు నెలల్లో అసిఫ్ మునీర్ అమెరికాకు పర్యటించడం ఇది రెండోసారి
అలాగే అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్‌ను కలసి పాకిస్తాన్‌కు రావాలని ఆహ్వానించారు. ఇదిలాఉండగా గత రెండు నెలల్లో అసిఫ్ మునీర్ అమెరికాకు పర్యటించడం ఇది రెండోసారి. ఈ ఏడాది జూన్‌లో ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కూడా సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత అమెరికా-పాకిస్తాన్ సహకారం పెంపుపై, చమురు ఒప్పందం సహా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవలే ఒక అమెరికా జనరల్ పాకిస్తాన్‌ను ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో "అద్భుత భాగస్వామి"గా ప్రశంసించిన విషయం గుర్తుచేసుకోవాలి.