
లిథియం అయాన్ బ్యాటరీ సృష్టికర్త, నోబెల్ గ్రహీత జాన్ గుడినెఫ్ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత ఆధునిక కాలంలో చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా సమయం గడవని పరిస్థితి వచ్చేసింది.
ఒక దశలో స్మార్ట్ ఫోన్ వాడకంతోనే ఎన్నో వ్యవహారాలను చక్కదిద్దుకుంటున్నాం. స్మార్ట్ ఫోన్ లో లిథియం అయాన్ బ్యాటరీదే కీలకపాత్ర. అయితే దీన్ని సృష్టించిన నోబెల్ పురస్కార గ్రహీత జాన్ బీ గుడినెఫ్ కన్నుమూశారు.
అమెరికాలోని టెక్సాస్ ఆస్టిన్ లో ఆదివారం గుడినెఫ్ తుదిశ్వాస విడిచినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
ఫోన్ తో పాటు ల్యాప్ టాప్స్, టాబ్లెట్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో లిథియం అయాన్ బ్యాటరీదే ప్రధాన పాత్ర.
1980లో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న క్రమంలో గుడినెఫ్, లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ క్యాథోడ్ బ్యాటరీని డెవలప్ చేశారు.
DETAILS
1991లో తొలిసారిగా భద్రతతో కూడిన లిథియం అయాన్ రీచార్జబుల్ బ్యాటరీ
బ్రిటిన్ కెమిస్ట్ డా. విట్టింగ్ హమ్ తయారు చేసిన ఈ డిజైన్ కు గుడినెఫ్ మెరుగులుదిద్దారు. అలాగే అధిక ఇంధన నిల్వ సామర్థ్యాన్ని పెంచి భద్రతనూ పెంచారు.
లిథియం అయాన్ బ్యాటరీ ఆవిష్కరణలో ముఖ్యపాత్ర పోషించినా అనంతర కాలంలో దానికి సంబంధించిన రాయల్టీని పొందకపోవడం గమనార్హం.
ఈ మేరకు బ్యాటరీ పరిశోధనపై పెటేంట్ రైట్స్ కి సంబంధించిన దస్త్రంపై ఆమోద ముద్ర వేసేశారు.
గుడినెఫ్ రూపొందించిన క్యాథోడ్, కార్బన్ అనోడ్ తో కలిపి తొలిసారిగా భద్రతతో కూడిన లిథియం అయాన్ రీచార్జబుల్ బ్యాటరీని సోనీ సంస్థ 1991లో తయారు చేసింది.
సుదీర్ఘ పరిశోధనల అనంతరం 2019లో బ్యాటరీ సైన్స్ అభివృద్ధిలో మరో ఇద్దరు సైంటిస్టులతో కలిసి గుడినెఫ్ నోబెల్ అందుకున్నారు.