LOADING...
Putin: భారత్‌, చైనాలపై అమెరికా వైఖరి సరైంది కాదు: పుతిన్
భారత్‌, చైనాలపై అమెరికా వైఖరి సరైంది కాదు: పుతిన్

Putin: భారత్‌, చైనాలపై అమెరికా వైఖరి సరైంది కాదు: పుతిన్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
08:54 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు ఇటీవలి కాలంలో గణనీయంగా క్షీణించాయి.కారణం అమెరికా విధించిన భారీ సుంకాలే. ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌,చైనాలపై అమెరికా వ్యవహారం సరైనదికాదని ఆయన స్పష్టం చేశారు. శాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు, సైనిక పరేడ్‌లో పాల్గొనడానికి పుతిన్ చైనా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, అమెరికా చర్యలపై స్పందించారు. పుతిన్ మాట్లాడుతూ,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో ఆసియాలోని రెండు అతిపెద్ద దేశాలను.. భారత్‌, చైనాలను..అణగదొక్కడానికి ఆర్థిక ఒత్తిడిని ఒక సాధనంలా ఉపయోగించారని విమర్శించారు. ఈరెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వాములని గుర్తుచేస్తూ,ట్రంప్ చర్యలు వారి ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసే విధంగానే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

వివరాలు 

రెండు దేశాల చరిత్రలో వలస పాలన అనుభవం

"భారత్‌, చైనాలు కలిపి 1.5 బిలియన్ల జనాభాతో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలు. ఆయా దేశాలకు ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థలు, చట్టాలు ఉన్నాయి. ఇలాంటి దేశాలపై సుంకాల రూపంలో శిక్షలు విధిస్తే, అది ఆ దేశ నాయకులను క్లిష్ట పరిస్థితుల్లోకి నెడుతుంది. వారిలో ఎవరైనా దానికి లోబడితే వారి రాజకీయ జీవితం సవాలుగా మారుతుంది. ఈ రెండు దేశాల చరిత్రలో వలస పాలన అనుభవం ఉంది. ఆ కాలంలోనే వారి సార్వభౌమాధికారాన్ని దెబ్బతీశారు. ఇప్పుడు కాలం మారింది. అలాంటప్పుడు మళ్లీ అణగదొక్కేలా మాట్లాడటం తగదు. భాగస్వాములతో సంభాషణ జరిపేటప్పుడు జాగ్రత్తగా, సముచితమైన పదాలు ఉపయోగించాలి" అని పుతిన్ హెచ్చరించారు.

వివరాలు 

భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు వసూలు చేస్తోంది: ట్రంప్  

ఈ వివాదాలు,ఉద్రిక్తతలు ఎక్కువ కాలం నిలవవని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.త్వరలోనే ఇరువైపుల సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక రష్యా నుంచి భారత్‌ చమురు దిగుమతులు చేసుకుంటోందన్న కారణంతోనే అమెరికా భారత్‌పై భారీ సుంకాలు విధించిందని పుతిన్ గుర్తుచేశారు. ట్రంప్ ప్రభుత్వ సమయంలో అమెరికా నాయకులలో కొందరు భారత్‌పై విమర్శలు గుప్పించారని తెలిపారు. ఈ కారణంగానే రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తతలకు లోనయ్యాయని ఆయన పేర్కొన్నారు. అయితే భారత్‌పై విధించినవి రెండో స్థాయి (secondary)సుంకాలేనని,అవి కూడా రెండు-మూడు దశల్లో ఉన్నాయని ట్రంప్‌ అన్నారు. భారత్‌తో సహకారం కొనసాగుతుందని చెప్పినప్పటికీ,ఆ దేశం ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు వసూలు చేస్తోందని ట్రంప్ ఆరోపించిన విషయం కూడా పుతిన్ ప్రస్తావించారు.