
PM Modi Invites Ukraine: జెలెన్‌స్కీని భారత్‌కు ఆహ్వానించిన మోదీ.. తగిన తేదీ కోసం ప్రయత్నిస్తున్నాం: ఉక్రెయిన్ రాయబారి
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ఈ విషయాన్ని తాజాగా ఉక్రెయిన్ రాయబారి అలెగ్జాండర్ పొలిష్చుక్ వెల్లడించారు. ఉక్రెయిన్ జాతీయ పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఢిల్లీలో ఒక ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ, జెలెన్‌స్కీ రాకకు ఇరుదేశాల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. "జెలెన్‌స్కీ భారతదేశానికి వస్తారని మేము ఆశిస్తున్నాం. ఇది మన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన కార్యక్రమంగా నిలుస్తుంది. తగిన తేదీ కోసం ఆయన అంగీకరించడానికి మేము ప్రయత్నిస్తున్నాం" అని చెప్పారు.
వివరాలు
శాంతి చర్చల్లో భారత్ కీలక పాత్రధారి
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించడంలో భారత్ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. రష్యాతో భారతదేశానికి ఉన్న దీర్ఘకాల సంబంధాలను దృష్టిలో ఉంచుకుని,శాంతి చర్చల్లో భారత్‌ను కీలక పాత్రధారిగా తాము భావిస్తున్నామన్నారు. అలాగే, ప్రధాని మోదీ శాంతిని, కాల్పుల విరమణను సమర్థంగా కొనసాగిస్తున్నారని ఆయన ప్రశంసించారు. భారత్ తటస్థ దేశం కాదని, శాంతి, దౌత్య సంబంధాలు, రాజకీయ చర్చల్లో అది దృఢమైన మద్దతు ఇస్తుందన్నారు.