LOADING...
GST on cars, two-wheelers: వాహనాల విభాగాల వారీగా పన్నులు ఎలా విధిస్తున్నారు? 
వాహనాల విభాగాల వారీగా పన్నులు ఎలా విధిస్తున్నారు?

GST on cars, two-wheelers: వాహనాల విభాగాల వారీగా పన్నులు ఎలా విధిస్తున్నారు? 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2025
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ దీపావళికి వాహనాలు కొనే వారికి శుభవార్త రానుంది. కార్లు,టూ-వీలర్లపై వస్తు సేవల పన్ను (GST)ని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. పన్ను నిర్మాణంలో మార్పులు చేయాలన్న కేంద్ర ప్రణాళికలో భాగంగా ఈ చర్య చేపట్టబోతున్నట్టు సమాచారం. దీంతో మధ్యతరగతి ప్రజలకు వాహనాల కొనుగోలు మరింత సులభతరం కానుంది. 2017 జూలైలో దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చి పాత పన్నులన్నింటికీ బదులుగా నాలుగు స్లాబ్‌లలో అమలవుతోంది. 5%, 12%, 18%,28%. కొత్త ప్రతిపాదన ప్రకారం 5%, 18% స్లాబ్‌లను కొనసాగిస్తూ, 12%, 28% స్లాబ్‌లను తొలగించే అవకాశముంది. ఈ మార్పులు చిన్న కార్లు,ఎంట్రీ-లెవల్ బైక్‌లకు పెద్ద ఉపశమనాన్ని ఇవ్వనున్నాయి.

వివరాలు 

వాహనాలపై ప్రభుత్వం జీఎస్టీతో పాటు ప్రత్యేక సెస్స్ వసూలు 

అయితే లగ్జరీ కార్లకు 40% కొత్త స్లాబ్‌లో పన్ను విధించే అవకాశం ఉంది. జీఎస్టీతో పాటు వాహనాలపై ప్రభుత్వం ప్రత్యేక సెస్స్ కూడా వసూలు చేస్తోంది. ఎక్స్-షోరూమ్ ధరలో జీఎస్టీ కూడా చేరిపోతుంది. కాబట్టి పన్ను తగ్గితే నేరుగా వాహన ధరలు పడిపోతాయి. దాంతో రోడ్డుమీద రిజిస్ట్రేషన్ ధర కూడా తగ్గుతుంది.

వివరాలు 

నిపుణుల అభిప్రాయాలు 

ఎస్&పీ గ్లోబల్ మొబిలిటీ అసోసియేట్ డైరెక్టర్ గౌరవ్ వంగాల్ అభిప్రాయం ప్రకారం.. పన్ను తగ్గితే కస్టమర్లకు,తయారీదారులకు ఉపయోగమే అయినా.. గతంలో ఆటో రంగాన్ని ప్రభుత్వం 'రెవెన్యూ క్యాష్ కౌ'లా చూసిన సందర్భాలు ఉన్నాయి. చిన్న కార్లపై సెస్స్ పెంచడం వంటి ప్రతిపాదనలు వస్తే మొత్తం ప్రయోజనం తగ్గిపోవచ్చు. దాంతో కంపెనీలు ఉత్పత్తి వ్యూహాలను సవరించడంలో ఇబ్బంది పడతాయి. కొనుగోలు దారులు కూడా స్పష్టత వచ్చే వరకు ఆగిపోతే, తాత్కాలికంగా విక్రయాలు తగ్గే ప్రమాదం ఉంది అన్నారు.

వివరాలు 

నిపుణుల అభిప్రాయాలు 

ప్రైమస్ పార్ట్నర్స్ వైస్ ప్రెసిడెంట్ నిఖిల్ ధాకా ప్రకారం.. పన్ను తగ్గితే చిన్న కార్లు, బైక్‌లపై 20 నుంచి 25 వేల రూపాయల వరకు వినియోగదారులకు ఆదా అవుతుంది. ఇది నేరుగా అందుబాటు పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ విశ్లేషకుల ప్రకారం.. పన్ను తగ్గితే తక్షణం ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా.. ఆటో రంగంలో డిమాండ్ పెరిగి ఉపాధి అవకాశాలు ఎక్కువ అవుతాయి. ప్యాసింజర్ వాహనాలు ఏటా 14-15 బిలియన్ డాలర్లు జీఎస్టీ రూపంలో, టూ-వీలర్లు 5 బిలియన్ డాలర్లు ప్రభుత్వానికి తెస్తున్నాయి అన్నారు.

వివరాలు 

ఎవరికి లాభం? 

మారుతీ సుజుకీకి ఈ మార్పులు పెద్ద మేలు చేసే అవకాశముంది. అల్టో K10, సెలెరియో, వాగన్‌ఆర్, స్విఫ్ట్, బలెనో, డిజైర్ వంటి చిన్న కార్లు పెద్ద ఎత్తున ఉండటం వల్ల లాభం ఎక్కువగా దక్కనుంది. హ్యుందాయ్, టాటా మోటార్స్ కూడా సబ్-4 మీటర్ మోడళ్ల వల్ల లాభపడతాయి. టూ-వీలర్లలో హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా, టీవీఎస్, బజాజ్ ఆటో వంటి కంపెనీలు వినియోగదారులకు అనుకూలమైన మోడళ్లతో ఉండటం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందనున్నాయి.

వివరాలు 

ప్రస్తుత పన్ను రేట్లు 

ఎలక్ట్రిక్ వాహనాలపై 5% జీఎస్టీ, హైడ్రజన్ ఫ్యూయల్ వాహనాలపై 12% జీఎస్టీ. ఆటో రిక్షాలు అన్నింటికీ 28% జీఎస్టీ. బైక్‌లు 350cc వరకు 28% జీఎస్టీ, 350cc పైగా ఉంటే 28% + 3% సెస్స్ (మొత్తం 31%). పెట్రోల్, సిఎన్‌జి, ఎల్పిజి కార్లు (4 మీటర్ల లోపు, 1200cc వరకు) - 28% జీఎస్టీ + 1% సెస్స్ (29%). డీజిల్ కార్లు (4 మీటర్ల లోపు, 1500cc వరకు) - 28% + 3% సెస్స్ (31%). 1500cc వరకు ఉన్న పెద్ద కార్లు - 28% + 17% సెస్స్ (45%). 1500cc పైగా ఉంటే - 28% + 20% సెస్స్ (48%).

వివరాలు 

చిన్న కార్లు, ఎంట్రీ-లెవల్ బైక్‌లకు లాభం

SUVలు (4 మీటర్లకు పైగా, 1500cc పైగా, 170mm క్లియరెన్స్ ఉన్నవి) - 28% + 22% సెస్స్ (50%). హైబ్రిడ్ కార్లు (4 మీటర్ల లోపు, 1200cc/1500cc వరకు) - 28% జీఎస్టీ మాత్రమే. పెద్ద హైబ్రిడ్లకు 28% + 15% సెస్స్. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ 10-13 సీటర్లు - 28% + 15% సెస్స్. 13 సీట్లకు మించి, కమర్షియల్ గూడ్స్ వాహనాలకు 28% మాత్రమే. జీఎస్టీ తగ్గింపు పూర్తిగా అమల్లోకి వస్తే.. చిన్న కార్లు, ఎంట్రీ-లెవల్ బైక్‌లకు నిజమైన లాభం చేకూరనుంది. యంగ్ బయ్యర్స్, గ్రామీణ కుటుంబాలు మళ్లీ కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.