Tesla: బెంగళూరులో టెస్లా కొత్త షోరూమ్ ప్రారంభం.. వైట్‌ఫీల్డ్‌లో కొత్త సెంటర్
ఈ వార్తాకథనం ఏంటి
టెస్లా భారత్‌లో మరో కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. ముంబై, ఢిల్లీ తర్వాత ఇప్పుడు బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో తన కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశ టెక్ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరులో ఈ కొత్త సెంటర్‌ను 2026 మే 14 నుంచి ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. ఇక్కడికి వచ్చే వినియోగదారులు టెస్లా మోడల్ వై (Model Y) తో పాటు తాజాగా లాంచ్ అయిన 6 సీట్ల ఎస్‌యూవీ అయిన టెస్లా మోడల్ వై L ను కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు. భారతదేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తు లక్ష్యంగా ఈ విస్తరణ చేస్తున్నట్లు టెస్లా పేర్కొంది. వైట్‌ఫీల్డ్‌లోనే ఆఫ్టర్ సేల్స్ సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చింది.
వివరాలు
ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం వెళ్లొచ్చంటే..
టెస్లా తెలిపిన వివరాల ప్రకారం, మోడల్ వై L 6-సీటర్ ఎలక్ట్రిక్ SUV కి ANCAP లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. ఫ్యామిలీ వినియోగానికి అనుకూలంగా రూపొందించిన ప్రీమియం వాహనమని కంపెనీ చెబుతోంది. ఇందులో ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 681 కిలోమీటర్ల వరకు (WLTP) ప్రయాణించవచ్చు. 0 నుంచి 100 కి.మీ వేగాన్ని కేవలం 5 సెకన్లలో అందుకుంటుంది. 2,539 లీటర్ల వరకు కార్గో స్పేస్ ఉండటం దీని ప్రత్యేకతగా పేర్కొంది. మోడల్ వై L లో మూడు వరుసల సీటింగ్ ఉండటంతో హెడ్‌రూమ్, లెగ్‌రూమ్ మరింత పెరిగి ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు కూడా మెరుగైన అనుభవం ఇవ్వడమే దీని లక్ష్యమని పేర్కొంది.
వివరాలు
ఫీచర్లు ఇవే..
భద్రత పరంగా టెస్లా వాహనాలు అత్యుత్తమంగా ఉంటాయని కంపెనీ తెలిపింది. మోడల్ వై L, అలాగే మోడల్ వై రెండూ కూడా అమెరికాలోని NHTSA, IIHS, యూరప్‌లోని Euro NCAP, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ANCAP, చైనాచైనాలోని CIASI వంటి ప్రముఖ గ్లోబల్ సేఫ్టీ సంస్థల నుంచి ఉన్నత రేటింగ్‌లు పొందినట్లు టెస్లా వెల్లడించింది. చార్జింగ్ విషయంలో చూస్తే, మోడల్ వై లాంగ్ రేంజ్, మోడల్ వై L రెండింటికీ 83 kWh బ్యాటరీ ఉంటుంది. గరిష్టంగా 250 kW ఛార్జింగ్ వేగాన్ని సపోర్ట్ చేస్తాయి. అయితే పెద్ద కార్ అయినప్పటికీ మోడల్ వై L ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే అదనంగా 20 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.
వివరాలు
ధరల వివరాలు ఇవే..
ఇంకా టెస్లా "ప్లగ్ ఇన్, ఛార్జ్ అండ్ గో" అనుభవం ద్వారా దూర ప్రయాణాలు సులభం అవుతాయని చెబుతోంది. భారత్‌లో హోమ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉండటంతో వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ మొబిలిటీ అనుభవం లభిస్తుందని కంపెనీ తెలిపింది. ధరల విషయానికి వస్తే, సాధారణ టెస్లా మోడల్ వై ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. లాంగ్ రేంజ్ వేరియంట్ ధర రూ. 67.89 లక్షలు. ఇక కొత్త మోడల్ వై L ధర రూ. 61.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. సాధారణ వేరియంట్‌తో పోలిస్తే ఇది సుమారు రూ. 2.1 లక్షలు ఎక్కువ ధరకు లభిస్తోంది.