
Tesla: లగ్జరీ కార్లు కొనే వారికి ఇది గుడ్ న్యూస్.. ఈ రోజే దేశంలో టెస్లా తొలి షోరూం ఓపెన్..
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్‌కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ 'టెస్లా' భారతదేశ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ముంబైలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయిన బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో సుమారు 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టెస్లా తన కొత్త షోరూమ్‌ను ప్రారంభించబోతోంది. ఈ షోరూంలో చైనాలో తయారైన మోడల్ Y క్రాస్‌ఓవర్ కార్లను ప్రదర్శించనున్నారు. ఇక జూలై నెలాఖరులోగా న్యూఢిల్లీ ప్రాంతంలో రెండో షోరూమ్‌ను ప్రారంభించాలని టెస్లా ప్రణాళిక వేస్తోంది. అయితే, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన భారత్‌లో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన టెస్లాకు ఇప్పటివరకు లేదు. లాభాల కంటే బ్రాండ్ గుర్తింపును పెంచుకోవాలనే లక్ష్యంతోనే విదేశాల నుంచి కార్లను దిగుమతి చేసి భారత మార్కెట్లోకి తీసుకురానుంది.
వివరాలు
త్రైమాసికంలో క్షిణించిన టెస్లా అమ్మకాలు
ప్రస్తుతం టెస్లా తన ప్రధాన మార్కెట్లైన అమెరికా, చైనాలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత్‌లో తన మార్కెట్‌ను విస్తరించాలని భావిస్తోంది. ఇటీవల జరిగిన త్రైమాసికంలో టెస్లా అమ్మకాలు క్షీణించాయి. అమెరికాకు చెందిన ఈ సంస్థ చైనాలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా మోడల్ Y అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు పొందింది. కానీ భారతదేశంలో ఈ కారును కొనే అవకాశం ఉన్నవారు పరిమితంగానే ఉంటారని అంచనా. దీని ధర సుమారుగా రూ.60లక్షల నుంచి రూ.70లక్షల వరకు ఉండనుందని భావిస్తున్నారు.
వివరాలు
బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థలతో టెస్లా పోటీ
ముఖ్యంగా లగ్జరీ వాహనాల కొనుగోలుదారుల కోసం టెస్లా మంచి ఎంపికగా నిలవనుంది. బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థలతో టెస్లా పోటీ పడనుంది. అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను అందించే టాటా, మహీంద్రా సంస్థలతో పోటీ ఉండే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.