కాలుష్యం పన్నుపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు.. ఇక డీజిల్ వాహనాలపై 10 శాతం పొల్యూషన్ ట్యాక్స్
డీజిల్ వాహనాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయా వాహనాలపై 10 శాతం మేర కాలుష్యపు పన్నును ప్రతిపాదించనున్నట్లు వెల్లడించారు. వాటి విక్రయాలు నిరుత్సాహపరచాలన్న ఉద్దేశంతోనే అదనంగా మరో 10 శాతం మేర జీఎస్టీ విధించేందుకు యోచిస్తున్నామన్నారు. సియామ్ వార్షిక సదస్సులో భాగంగా మాట్లాడిన గడ్కారీ పొల్యూషన్ ట్యాక్స్‌ను ప్రవేశపెడతామన్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాయాలనుకుంటున్నట్లు చెప్పిన గడ్కారీ, వాయు కాలుష్యం తగ్గించాలన్నదే ట్యాక్స్ లక్ష్యమన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమలు, డీజిల్ వాహన ఉత్పత్తులను తగ్గించాలని కోరుతున్నట్లు చెప్పారు. ఉత్పత్తిని తగ్గించకుంటే, పన్ను విధించాల్సి వస్తుందని, అప్పుడు వాహనాలు విక్రయించడం ఇబ్బందికరమన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా డీజిల్ కార్ల సంఖ్య తగ్గిందన్నారు.
గడ్కరీ వ్యాఖ్యల నేపథ్యంలో పతనమైన షేర్ మార్కెట్లు
పర్యావరణానికి డీజిల్ హాని కలిగిస్తోందని, ఫలితంగా తయారీ సంస్థలు వాటిని పూర్తిగా నిలిపేయాలని సూచించారు. పర్యావరణహితమైన వాహనాల ఉత్పత్తిపై దృష్టి సారించాలని వాహన తయారీ సంస్థలను కోరారు. ఇదే సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రయాణికుల వాహన సెగ్మెంట్లో మారుతీ సుజుకీ, హోండా లాంటి కంపెనీలు డీజిల్ కార్ల తయారీని ఇప్పటికే పూర్తిగా నిలిపేశాయి. వాహనాలు ప్రస్తుతం 28 శాతం జీఎస్టీ శ్లాబులోనే ఉండగా, వాహన రకాన్ని బట్టి 1 నుంచి 22 శాతం వరకు అదనపు సెస్సు విధిస్తున్ఎనాయి. ఇక ఎస్‌యూవీ(SUV)లకు గరిష్ఠంగా 28 శాతం జీఎస్టీ, 22 శాతం సెస్సును వసూలు చేయడం గమనార్హం.