LOADING...
India-US Trade Deal: భారత్‌-అమెరికా మధ్య.. ఈ నెలలోనే మధ్యంతర ట్రేడ్‌ డీల్‌..! 
భారత్‌-అమెరికా మధ్య.. ఈ నెలలోనే మధ్యంతర ట్రేడ్‌ డీల్‌..!

India-US Trade Deal: భారత్‌-అమెరికా మధ్య.. ఈ నెలలోనే మధ్యంతర ట్రేడ్‌ డీల్‌..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

టారిఫ్‌ల తగ్గింపు, మార్కెట్‌ సౌలభ్యం, డిజిటల్‌ వాణిజ్య అభివృద్ధి వంటి కీలక అంశాలపై భారత్‌-అమెరికా మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల దిశగా కొనసాగుతున్నాయి. కొన్ని వారాల్లో ఇరుదేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న సుమారు 190 బిలియన్‌ డాలర్ల వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్‌ డాలర్లకు పెంచాలన్న లక్ష్యంతో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా, వాణిజ్య సంబంధిత అంశాలపై ఇరుదేశాల ప్రతినిధులు నాలుగు రోజులపాటు ఢిల్లీలో సమావేశమయ్యారు. మంగళవారం ఈ చర్చలు ముగిశాయి. పారిశ్రామిక,వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ సౌలభ్యం కల్పించడం,సుంకాల తగ్గింపు,టారిఫ్ మినహాయింపులు వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.

వివరాలు 

అమెరికా నుండి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్

పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమతుల్యమైన ఒప్పందం దిశగా చర్చలు పురోగమిస్తున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, అమెరికా వ్యవసాయ దిగుమతులపై చేసిన కొన్ని డిమాండ్లను భారత్‌ తిరస్కరించినట్లు సమాచారం. మరోవైపు, ఉక్కు ఉత్పత్తులపై అమెరికా విధించిన 50 శాతం సుంకం నుంచి భారత్‌ను మినహాయించాలంటూ భారత ప్రతినిధులు కోరారు. దీనికి ప్రత్యామ్నాయంగా, అమెరికా నుండి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ (CNG), క్రూడ్ ఆయిల్, బొగ్గు దిగుమతులను పెంచేందుకు భారత్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది.

వివరాలు 

 జీ7 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు,భారత ప్రధాని 

ఇదిలా ఉండగా, జూన్‌ 15 నుండి 17 వరకు కెనడాలో జరగనున్న జీ7 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకాబోతున్నారు. ఈ సదస్సు నేపథ్యంలో వారిద్దరి మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఆ సమావేశంలో వాణిజ్య ఒప్పందంపై సమగ్ర చర్చ జరిగే అవకాశం ఉంది. అనంతరం మధ్యంతర ఒప్పందం ఖరారయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జూన్‌ నెలలోనే ఈ ట్రేడ్‌ డీల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.