8th Pay Commission: 8వ పే కమిషన్‌లో కనీస వేతనం రూ.34,500 కావచ్చు.. అడ్వైజరీ బాడీ సమావేశంలో ప్రకటన చేసే అవకాశం
ఇప్పటివరకు 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 2025లోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో కొత్త వేతన సంఘం ఏర్పాటు గురించి చర్చలు ముమ్మరం అవుతున్నాయి. 2024 నవంబరులో జరిగే జాయింట్ అడ్వైజరీ బాడీ సమావేశంలో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కార్మిక సంఘాల ప్రతినిధులు ఉద్యోగుల జీతాలు, సేవా షరతులకు సంబంధించిన డిమాండ్లను ప్రభుత్వం ఎదుట ఉంచనున్నారని భావిస్తున్నారు. 8వ వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనాలు దక్కే అవకాశం ఉంది. ఈ సిఫార్సులు అమలులోకి వస్తే ఉద్యోగుల కనీస వేతనం, పెన్షన్ ఎటువంటి మార్పులు పొందుతాయో చూద్దాం.
2026లో కొత్త పే కమిషన్ అమలులోకి వచ్చే అవకాశం
ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం కొత్త పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. దీని సిఫార్సులు ప్రధానంగా ద్రవ్యోల్బణం వంటి ఆర్థిక కారకాలపై ఆధారపడి ఉంటాయి. 2014లో ఏర్పాటైన 7వ వేతన సంఘం సిఫార్సులు 2016 నుంచి అమలులోకి వచ్చాయి, వీటి కాలపరిమితి 2025 డిసెంబర్ 31తో ముగుస్తుంది. తదుపరి 2026లో కొత్త పే కమిషన్ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. అయితే 2025 బడ్జెట్‌లో ప్రభుత్వం దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ పే కమిషన్ అమల్లోకి వస్తే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పెరిగిన జీతాలు, పెన్షన్లను పొందే అవకాశం ఉంటుంది.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 నుంచి 3.00-3.68 మధ్య..
ఈ కొత్త వేతన సిఫార్సుల ప్రకారం, ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000 నుంచి సుమారు రూ.34,560కు పెరగవచ్చు. అలాగే, పెన్షన్లు రూ.17,280కి చేరే అవకాశం ఉంది. జీవన వ్యయం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని సిఫార్సులు చేస్తారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 నుంచి 3.00-3.68 మధ్య ఉండవచ్చు. ఇది పెరిగితే ఉద్యోగుల బేసిక్ పే రూ.20,000 నుంచి రూ.25,000 వరకు పెరగొచ్చు. ఫిట్‌మెంట్ మార్పు వలన ఉద్యోగుల టేక్ హోం శాలరీ కూడా పెరుగుతుంది. ఈ మార్పుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 48.62 లక్షల మంది ఉద్యోగులు, 67.85 లక్షల మంది పెన్షనర్లు లాభపడే అవకాశం ఉంది.