
Air India: పాకిస్థాన్ గగనతలం ఒక సంవత్సరం పాటు మూసివేస్తే ఎయిర్ ఇండియాకు ఎంత నష్టమో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు భారత విమానయాన రంగంపై ప్రభావం చూపుతున్నాయి.
ఇటీవల ఇండిగో షేర్ల పతనం గురించి చర్చలు జరిగిన నేపధ్యంలో, ఇప్పుడు టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా గురించీ చర్చ జరుగుతోంది.
పాకిస్తాన్ తన గగనతలాన్ని భారతీయ విమానయాన సంస్థలకు ఒక సంవత్సరం పాటు మూసివేస్తే, ఏటా ఎయిర్ ఇండియాకు రూ. 50,000 కోట్ల మేర నష్టం సంభవించవచ్చని రాయిటర్స్ నివేదిక వెల్లడించింది.
ఈ అంశాన్ని ఎయిర్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖలో ప్రస్తావించిందని, ఆ లేఖను రాయిటర్స్ పరిశీలించినట్టు పేర్కొంది.
వివరాలు
ఏడాదికి రూ. 50,400 కోట్ల నష్టం భరించాల్సి వస్తుందా?
పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించకుండా విమానాలను నడపాల్సి వస్తే, ఎయిర్ ఇండియా దాదాపు $600 మిలియన్ల (రూ. 50,400 కోట్లు) అదనపు ఖర్చులను ఎదుర్కొనాల్సి వస్తుందని అంచనా వేయబడింది.
ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరినట్టు తెలుస్తోంది. గత వారం కాశ్మీర్‌లో పహల్గామ్ వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి భారత ప్రభుత్వం ప్రతిస్పందనగా సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడంతో, పాకిస్తాన్ తన వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది.
దీని వల్ల భారతీయ విమానయాన సంస్థలకు ప్రయాణ మార్గాలు పొడవు కావడంతో ఇంధన వ్యయం పెరిగి, నిర్వహణ వ్యయాలు అధికమయ్యే అవకాశముంది.
వివరాలు
సబ్సిడీ ఇవ్వాలని అభ్యర్థన
ఏప్రిల్ 27న ఎయిర్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి, ఈ నిషేధం వల్ల సంస్థకు ఏడాదికి రూ. 50 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశముందని తెలియజేసింది.
ప్రభావిత అంతర్జాతీయ రూట్లకు తాత్కాలిక సబ్సిడీ మంజూరు చేయాలనే అభిప్రాయాన్ని సంస్థ వ్యక్తం చేసింది.
పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటే ఆ సబ్సిడీని తొలగించవచ్చని లేఖలో పేర్కొంది.
గగనతలాల మూసివేత, అధిక ఇంధన వినియోగం, అదనపు సిబ్బంది నియామకం వల్ల సంస్థపై భారంగా మారిందని పేర్కొంది.
వివరాలు
కేంద్రం స్పందించలేదా?
ET నివేదిక ప్రకారం.. ఎయిర్ ఇండియా ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా వ్యాఖ్య ఇవ్వలేదు. గగనతల నిషేధం వల్ల కలిగే ప్రభావాన్ని అంచనా వేయమని ప్రభుత్వం అధికారులను ఆదేశించిన అనంతరం, ఎయిర్ ఇండియా ఈ లేఖను పంపినట్టు తెలిసింది.
ప్రభుత్వ యాజమాన్యం నుండి టాటా గ్రూప్‌కు మారిన ఈ సంస్థ ఇప్పటికే బోయింగ్, ఎయిర్‌బస్ డెలివరీల ఆలస్యంతో సమస్యలు ఎదుర్కొంటోంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు $520 మిలియన్ల నష్టం నమోదైంది.
వివరాలు
మార్కెట్‌లో ఎయిర్ ఇండియా స్థానం
భారత మార్కెట్లో 26.5 శాతం వాటా కలిగిన ఎయిర్ ఇండియా యూరప్, అమెరికా, కెనడా దేశాలకు విమానాలు నడుపుతుంది.
ఈ ప్రయాణాల్లో పాకిస్తాన్ గగనతలాన్ని తరచుగా దాటాల్సి వస్తుంది. ఇది దేశీయంగా పెద్ద పోటీదారైన ఇండిగో కంటే ఎక్కువ దూర ప్రయాణాల నిర్వహణ చేస్తుంది.
సిరియం అసెండ్ డేటా ప్రకారం.. ఎయిర్ ఇండియా, దాని బడ్జెట్ విభాగమైన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్,ఇండిగో కలిసి ఏప్రిల్ నెలలో న్యూఢిల్లీ నుండి యూరప్, మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికాకు కలిపి సుమారు 1,200 విమానాలు షెడ్యూల్ చేశాయి.
వివరాలు
చైనాతో సంప్రదింపులపై చర్చ
ఈ నిషేధం వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది.
చైనా సరిహద్దులకు సమీపంలోని ప్రాంతాల మీదుగా విమానాలను మళ్లించడం, పన్ను మినహాయింపులు వంటి పరిష్కారాలపై విమానయాన సంస్థలు పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
ఓవర్‌ఫ్లైట్ అనుమతుల కోసం చైనా అధికారులతో సంప్రదింపులు జరపాలని ఎయిర్ ఇండియా తన లేఖలో ప్రభుత్వాన్ని కోరింది.
అయితే దానికి సంబంధించిన వివరాలు పేర్కొనలేదు. అదనపు పైలట్లు నియమించి అమెరికా, కెనడా ఫ్లైట్స్‌లో ప్రయాణ సమయం తగ్గించేందుకు అనుమతివ్వాలని కూడా సంస్థ అభ్యర్థించింది.