
Airtel- Adani: అదానీ డేటా నెట్‌వర్క్స్ స్పెక్ట్రమ్ తో ఎయిర్‌టెల్ ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోని ప్రముఖ టెలికాం సేవల సంస్థ భారతీ ఎయిర్ టెల్ తన అనుబంధ సంస్థ అయిన భారతీ హెక్సాకామ్‌తో కలిసి, పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్‌తో ఒక కీలక ఒప్పందానికి కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం, అదానీ డేటా నెట్‌వర్క్స్‌కు చెందిన 26 గిగాహెర్ట్ (GHz) ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో ఉన్న 400 మెగాహెర్ట్ (MHz) స్పెక్ట్రమ్‌ను వినియోగించేందుకు ఎయిర్‌టెల్ అనుమతి పొందనుంది.
దీని ద్వారా సంస్థ తన 5జీ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు,వ్యవస్థ సామర్థ్యంలో కూడా గణనీయమైన అభివృద్ధిని సాధించగలదు.
అయితే ఈ ఒప్పందం అమలు కావడానికి సంబంధిత నియంత్రణ సంస్థల ఆమోదం అవసరం. లావాదేవీకి సంబంధించిన ఆర్థిక వివరాలను ఇప్పటికీ బహిర్గతం చేయలేదు.
వివరాలు
వేగవంతమైన డేటా సేవలను అందించగల ఎయిర్‌టెల్
ఇంతకముందు, 2022లో నిర్వహించిన స్పెక్ట్రమ్ వేలంలో,అదానీ డేటా నెట్‌వర్క్స్ 400 MHz స్పెక్ట్రమ్‌ను సుమారు రూ.212 కోట్లకు సొంతం చేసుకుంది.
ఇప్పుడు అదే స్పెక్ట్రమ్‌ను భారతీ ఎయిర్‌టెల్ వినియోగించబోతోంది.
ఈ స్పెక్ట్రమ్ మొత్తం ఆరు టెలికాం సర్కిళ్ల పరిధిలో ఉంది. గుజరాత్, ముంబయి రాష్ట్రాల్లో 100 MHz చొప్పున, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 50 MHz చొప్పున ఈ స్పెక్ట్రమ్ అందుబాటులో ఉంది.
ఈ అదనపు స్పెక్ట్రమ్‌ను వినియోగించడం ద్వారా ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు మరింత వేగవంతమైన డేటా సేవలను అందించగలదు.
అలాగే,నెట్‌వర్క్ సామర్థ్యం పెరగడం వల్ల సేవల నాణ్యత మెరుగవుతుంది.దాంతో, వినియోగదారులకు మన్నికైన, సమర్థవంతమైన టెలికాం అనుభవం అందించడంలో ఈ ఒప్పందం సంస్థకు కీలక పాత్ర పోషించనుంది.