Gautam Adani: బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం, మోసం ఆరోపణలపై కేసు
భారత బిలియనీర్, అదానీ గ్రూప్ సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ అభియోగాల ప్రకారం, అదానీ కంపెనీ అధికారులకు లంచాలు ఇచ్చి, ఆ లంచాల గురించి ఇన్వెస్టర్లను తప్పుడు సమాచారం ఇచ్చి, నిధుల సేకరణకు ప్రయత్నించినట్లు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు పేర్కొంటున్నారు. ఈ కారణంగా గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ సహా మరో ఏడుగురు వ్యాపారవేత్తలపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అదానీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలు గత 20 ఏళ్లలో సుమారు 2 బిలియన్ డాలర్ల లాభాన్ని సాధించడానికి, భారత ప్రభుత్వ అధికారులకు 265 మిలియన్ డాలర్లు లంచాలు చెల్లించినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
గౌతమ్ అదానీ అరెస్ట్ పై రాయిటర్స్ చేసిన ట్వీట్
మరో సివిల్ కేసు నమోదు
తద్వారా, వారు అమెరికా, అంతర్జాతీయ ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించి, నిధులు సమీకరించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ అనేక అక్రమ మార్గాల ద్వారా రుణ దాతలు, పెట్టుబడిదారుల నుంచి 3 బిలియన్ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లు సేకరించినట్లు ఆరోపించారు. అలాగే, అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ మరో సివిల్ కేసు నమోదు చేసింది. ఇందులో,అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ యుఎస్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘిస్తూ, అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్ డాలర్లకు పైగా నిధులు సేకరించిందని పేర్కొంది. ఈ కేసును దర్యాప్తు చేసి,జరిమానా విధించి, కంపెనీపై ఆంక్షలు విధించాల్సిందిగా రెగ్యులేటర్ కోరింది.అయితే, ఈ అభియోగాలపై అదానీ గ్రూప్ ఇప్పటి వరకు స్పదించ లేదు.