SEBI: సెబీ ఛైర్‌పర్సన్ పై కాంగ్రెస్ మరోసారి సంచలన ఆరోపణలు
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (SEBI) ఛైర్‌పర్సన్ మాధవీ పురి బుచ్‌పై కాంగ్రెస్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. ముంబైలో మాధవీకి చెందిన ఒక ప్రాపర్టీని సెబీ దర్యాప్తు చేస్తున్న ఓ సంస్థకు అద్దెకు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ అద్దె ద్వారా ఆమె ఆదాయం పొందుతున్నట్లు ఆరోపించిన కాంగ్రెస్ దీనిని అవినీతికి సంబంధించి వ్యవహారమని ఆరోపించింది. ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది.
అద్దె రూపంలో మాధవీ మొత్తంగా రూ.2.16 కోట్లు పొందారు: పవన్‌ఖేడా
"ఇది కేవలం వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాదు. ఇది అవినీతికి సంబంధించిన కేసు. సెబీ సభ్యురాలిగా ఉన్నప్పుడు మాధవీ 2018-19లో క్యారల్ ఇన్‌ఫో సర్వీసెస్ అనే సంస్థకు ఒక ప్రాపర్టీని అద్దెకు ఇచ్చారు. ఈ సంస్థ అనుబంధంగా ఉన్న Wockhardt అనే కంపెనీపై సెబీ దర్యాప్తు చేస్తోంది. ఆ రెండు కంపెనీల ప్రమోటర్లు కూడా ఒకరే. 2018-19 నుంచి 2023-24 వరకు అద్దె రూపంలో మాధవీ మొత్తంగా రూ.2.16 కోట్లు పొందారని కాంగ్రెస్ నేత పవన్‌ఖేడా చెప్పారు. సెబీకి సమగ్రత, జవాబుదారీతనం పతనమైందనడానికి ఇంతకంటే ఏం ఆధారాలు కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోదీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కూడా ప్రశ్నించారు.
ఐసీఐసీఐ బ్యాంకు అధికారి హోదాలో జీతభత్యాలు
2017 నుంచి 2021 వరకు సెబీ సభ్యురాలిగా పనిచేసిన మాధవీ, 2022 మార్చి 2న సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఆమె సెబీలో చేరినప్పటినుంచి, ఐసీఐసీఐ బ్యాంకు అధికారి హోదాలో జీతభత్యాలు అందుకున్నారని తెలిపింది. సెబీ సభ్యురాలిగా ఉన్నప్పుడు ఐసీఐసీఐ బ్యాంకుపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపుతూనే, అదే బ్యాంకు నుంచి ఆదాయం పొందారన్న విషయం ప్రధాని మోదీకి తెలుసా అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రశ్నించారు. అయితే, 2013 అక్టోబర్ 31న ఆమె పదవీవిరమణ తర్వాత ఆమెకు ఎటువంటి వేతన చెల్లింపులు చేయలేదని ఐసీఐసీఐ బ్యాంక్ స్పష్టంచేసింది.