Page Loader
Deepseek: ఏఐ విప్లవంలో డీప్‌సీక్‌ సెన్సేషన్.. ఏడాదికి 200 మిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయం
ఏఐ విప్లవంలో డీప్‌సీక్‌ సెన్సేషన్.. ఏడాదికి 200 మిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయం

Deepseek: ఏఐ విప్లవంలో డీప్‌సీక్‌ సెన్సేషన్.. ఏడాదికి 200 మిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2025
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనా ఏఐ స్టార్టప్‌ డీప్‌సీక్‌ (Deepseek) తన విప్లవాత్మక మోడళ్లతో పరిశ్రమను షేక్‌ చేస్తోంది. వీ3, ఆర్‌1 మోడళ్ల విడుదలతో గ్లోబల్‌ టెక్‌ రంగంలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ మోడళ్ల వ్యయం-లాభాల వివరాలను కంపెనీ వెల్లడించింది. డీప్‌సీక్‌ ప్రకారం వీటిలో రోజువారీ వ్యయ-లాభ నిష్పత్తి 545శాతం వరకు ఉండొచ్చని తెలిపింది. అయితే వాస్తవ ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

Details

డీప్‌సీక్‌ ఆదాయ వివరాలు 

డీప్‌సీక్‌ వినియోగంతో వచ్చే ఆదాయంపై ఆసక్తికరమైన లెక్కలను పంచుకుంది. ఒక హెచ్‌800 చిప్‌ను అద్దెకు తీసుకునేందుకు గంటకు 2 డాలర్లు ఖర్చవుతుందని అనుకుంటే వీ3, ఆర్‌1 మోడళ్ల కోసం రోజువారీ ఖర్చు 87,072 డాలర్లు అవుతుంది. ఇదే సమయంలో ఈ మోడళ్ల ద్వారా రోజుకు 5,62,027 డాలర్లు ఆదాయం వచ్చే అవకాశముందని అంచనా. దీని ప్రకారం ఖర్చు-లాభ నిష్పత్తి 545శాతం అవుతుంది. ఈ లెక్కన ఏడాదికి 200 మిలియన్‌ డాలర్లు పైగా ఆదాయం రావచ్చని అంచనా. - అయితే వాస్తవంగా ఈ ఆదాయం తక్కువగానే ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Details

ఆర్‌1 మోడల్‌ ఉచితం కావడం వల్ల మార్జిన్‌పై ప్రభావం 

డీప్‌సీక్‌ తన ఆర్‌1 మోడల్‌ను వెబ్‌, యాప్‌ యాక్సెస్‌ సేవలుగా ఉచితంగా అందిస్తోంది. దీనివల్ల కంపెనీ మార్జిన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. హాంగ్జౌకు చెందిన ఈ ఏఐ రీసెర్చ్‌ సంస్థ తన లాభాల వివరాలను తొలిసారి బహిరంగంగా వెల్లడించడం ఇదే మొదటిసారి. రాబోయే మోడళ్లపై కంపెనీ ప్రణాళికలు డీప్‌సీక్‌ ఆగకుండా మరికొన్ని అధునాతన మోడళ్లను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది మేలో ఆర్‌2 మోడల్‌ను విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తోంది. దీని సామర్థ్యం మరింత అధికంగా ఉండేలా అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

Details

 టెక్‌ దిగ్గజాలకు డీప్‌సీక్‌ పోటీ 

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై ఓపెన్‌ఏఐ, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి టెక్‌ దిగ్గజాలు బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నాయి. కానీ డీప్‌సీక్‌ కేవలం 6 మిలియన్‌ డాలర్లతో అత్యాధునిక ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దీనివల్ల తక్కువ పెట్టుబడితోనూ అత్యుత్తమ టెక్నాలజీ అభివృద్ధి చేయవచ్చని నిరూపించింది. దీని ఆర్‌1, వీ3 మోడళ్ల ఆధారంగా నడిచే వెబ్‌లు, చాట్‌బాట్‌లు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రజాదరణ పొందాయి. వీ3 మోడల్‌కు శిక్షణ ఇవ్వడానికి ఎన్విడియా హెచ్‌800 చిప్‌లు ఉపయోగించాయి. అయితే, ఆర్‌1 మోడల్‌ పూర్తిగా ఉచితం కావడంతో ఒక్కసారిగా విపరీతమైన ఆదరణ దక్కించుకుంది.

Details

డీప్‌సీక్‌ ప్రభావంతో టెక్‌ మార్కెట్‌పై ప్రభావం 

డీప్‌సీక్‌ ఉచిత మోడల్‌ వల్ల, ఏఐ విభాగంలో టెక్‌ దిగ్గజాల ఆదాయంపై ప్రభావం పడుతుందని అనుకుంటున్నారు. దీనివల్ల అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో టెక్‌ షేర్లు నష్టపోయాయి. ఇది డీప్‌సీక్‌ మోడళ్ల ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. డీప్‌సీక్‌ తక్కువ ఖర్చుతో అధునాతన ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసి, టెక్‌ పరిశ్రమను షేక్‌ చేస్తోంది. ఈ కంపెనీ నుంచి రాబోయే రోజుల్లో మరిన్ని విప్లవాత్మక మార్పులు ఎదురయ్యే అవకాశముంది. మేలో రానున్న ఆర్‌2 మోడల్‌, టెక్‌ మార్కెట్‌పై మరింత ప్రభావం చూపించే అవకాశం ఉంది.