
Elon Musk : ఎలాన్ మస్క్ స్ట్రాంగ్ వార్నింగ్.. యాపిల్‌ను కోర్టుకు లాగుతానని హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధా (ఏఐ) ఆధిపత్య పోరు రోజురోజుకీ వేడెక్కుతోంది. టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మంగళవారం టెక్ దిగ్గజం యాపిల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. యాపిల్ తన యాప్ స్టోర్‌లో ఓపెన్ఏఐకి చెందిన చాట్‌జీపీటీకి అనైతిక మద్దతు ఇస్తోందని, దీనివల్ల తన సొంత ఏఐ స్టార్టప్ 'ఎక్స్‌ఏఐ' (xAI) ఎదుగుదలకు అడ్డుకట్ట వేస్తోందని మస్క్ తీవ్రంగా విమర్శించారు. ఆపిల్ ప్రవర్తన కారణంగా ఓపెన్ఏఐ తప్ప మరే ఏఐ సంస్థ యాప్ స్టోర్‌లో నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకోవడం అసాధ్యం. ఇది స్పష్టంగా యాంటీట్రస్ట్ నిబంధనల ఉల్లంఘన. అందువల్ల ఎక్స్‌ఏఐ తక్షణమే చట్టపరమైన చర్యలు చేపడుతుందని మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
Details
వేరే మార్గం లేదన్న మస్క్
మరొక పోస్టులో ఆయన, "మాకు వేరే మార్గం లేదు. యాపిల్ చిన్నపాటి పక్షపాతం మాత్రమే కాదు, తన మొత్తం బలం ఓపెన్ఏఐకే వెచ్చిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌ఏఐ రూపొందించిన 'గ్రాక్' (Grok), ఓపెన్ఏఐకి చెందిన 'చాట్‌జీపీటీ' మధ్య పోటీ తీవ్రతరంగా ఉన్న సమయంలో ఈ ఆరోపణలు వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. గత నెలలో ఎక్స్‌ఏఐ 'గ్రాక్ 4'ను విడుదల చేసి, ఇమేజ్, వీడియో జనరేషన్ కోసం 'గ్రాక్ ఇమేజిన్' వంటి కొత్త ఫీచర్లు జోడించింది. దీంతో యాపిల్ ప్రొడక్టివిటీ కేటగిరీలో గ్రాక్ ర్యాంకు 60 నుంచి 2వ స్థానానికి ఎగబాకింది. అయితే చాట్‌జీపీటీ గత సంవత్సరం నుంచీ యాపిల్ యాప్ స్టోర్ ఓవరాల్ చార్ట్స్‌లో మొదటి లేదా రెండవ స్థానంలో కొనసాగుతోంది.
Details
మస్క్ ఆరోపణలపై స్పందించిన యాపిల్
యాపిల్ తన యాప్ స్టోర్ ఎడిటోరియల్ కంటెంట్‌లో చాట్‌జీపీటీని ప్రత్యేకంగా హైలైట్ చేయడం, అలాగే సిరి, రైటింగ్ టూల్స్‌లో ఓపెన్ఏఐ టెక్నాలజీని విలీనం చేయడం వల్లే ఈ స్థానం లభిస్తోందని మస్క్ ఆరోపిస్తున్నారు. వీటికి వినియోగదారుల సహజ ఆదరణ కాకుండా, యాపిల్ సృష్టిస్తున్న కృత్రిమ ప్రచారమే కారణమని ఆయన వాదన. మస్క్ చేసిన ఈ ఆరోపణలపై యాపిల్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ మస్క్ కోర్టును ఆశ్రయిస్తే, యాప్ స్టోర్ విధానాలపై ఉన్న వివాదాలతో పాటు ఏఐ మార్కెట్‌లో పోటీ మరింత ముదిరే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.