Page Loader
Flipkart IPO: దేశీయ మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఫ్లిప్‌కార్ట్.. ఐపీఓతో బిగ్ ఎంట్రీకి రంగం సిద్ధం
దేశీయ మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఫ్లిప్‌కార్ట్.. ఐపీఓతో బిగ్ ఎంట్రీకి రంగం సిద్ధం

Flipkart IPO: దేశీయ మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఫ్లిప్‌కార్ట్.. ఐపీఓతో బిగ్ ఎంట్రీకి రంగం సిద్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 09, 2024
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, దేశీయ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. రాబోయే 12-15 నెలల్లో ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) తీసుకురావడానికి సంస్థ వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే జొమాటో, స్విగ్గీ, నైకా వంటి సంస్థల సరసన చేరేందుకు ఫ్లిప్‌కార్ట్ సన్నాహాలను చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ తన హోల్డింగ్ కంపెనీని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చడానికి చర్యలు చేపట్టింది. అంతర్గతంగా ఈ మార్పు కోసం ఆమోదం కూడా పొందిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఐపీఓ 2025లోనే వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి.

Details

రూ.2,358 కోట్ల నికర నష్టాన్ని చవిచూసిన ప్లిప్ కార్ట్

ఆలస్యమైతే 2026 ప్రారంభంలో స్టాక్ ఎక్స్చేంజీలో లిస్టింగ్ సాధ్యమవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2007లో ఐఐటీ-దిల్లీ విద్యార్థులైన సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ స్థాపించిన ఫ్లిప్‌కార్ట్, ఒక చిన్న స్టార్టప్‌గా ప్రారంభమై ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇ-కామర్స్ సంస్థగా ఎదిగింది. 2018లో అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ 81% వాటాను కొనుగోలు చేయడం సంస్థ అభివృద్ధిలో కీలక మలుపు అని చెప్పొచ్చు. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.17,907 కోట్ల ఆదాయం నమోదు చేసిన ఫ్లిప్‌కార్ట్, రూ.2,358 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. టెక్నాలజీ ఆధారిత కంపెనీలకు విదేశాల్లో హోల్డింగ్ కంపెనీలను నెలకొల్పడం పరిపాటిగా ఉండగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు తమ హోల్డింగ్‌లను భారత్‌కు మార్చేందుకు సిద్ధమవుతున్నాయి.

Details

పెద్ద మొత్తంలో నిధులు సమీకరించేందుకు సిద్ధం

జెప్టో, మీషో, క్రెడిట్ బీ వంటి సంస్థల ప్రణాళికలతో పాటు ఫ్లిప్‌కార్ట్ కూడా ఈ మార్గంలో ముందడుగు వేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఐపీఓ, మార్కెట్లో మరో కీలక పరిణామంగా కనిపిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ పెద్ద మొత్తంలో నిధులు సమీకరించేందుకు అవకాశం ఉంది. మరోవైపు భారతీయ మార్కెట్‌లో ఇ-కామర్స్ వ్యాపారానికి ఈ తరహా విస్తరణ ప్రణాళికలు మరింత ప్రోత్సాహం అందిస్తాయి.