LOADING...
GST slabs: జీఎస్టీలో 2 శ్లాబుల ప్రతిపాదనకు మంత్రుల బృందం ఆమోదం
జీఎస్టీలో 2 శ్లాబుల ప్రతిపాదనకు మంత్రుల బృందం ఆమోదం

GST slabs: జీఎస్టీలో 2 శ్లాబుల ప్రతిపాదనకు మంత్రుల బృందం ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2025
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణల విషయంలో కీలక ముందడుగు పడింది. పరోక్ష పన్నుల విధానంలో రెండు ప్రధాన శ్లాబులు మాత్రమే ఉంచాలన్న కేంద్ర ప్రతిపాదనకు మంత్రుల బృందం (GoM) ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉన్న 12%, 28% శ్లాబులు తొలగించి, 5%,18% శ్లాబులు మాత్రమే కొనసాగించేందుకు మంత్రుల బృందం సమ్మతి తెలిపిందని బిహార్ ఉప ముఖ్యమంత్రి, రేటు హేతుబద్ధీకరణ విషయాలపై GoM కన్వీనర్ సామ్రాట్ చౌధరి పేర్కొన్నారు.

వివరాలు 

కేంద్ర ప్రతిపాదనలో ఆల్ట్రా లగ్జరీ, సిన్‌ గూడ్స్‌పై 40 శాతం పన్ను

సామ్రాట్ చౌధరి మీడియాకు వివరించగా, కేంద్రం చేసిన రెండు ప్రతిపాదనలకు మంత్రుల బృందం పూర్తి ఆమోదం తెలిపిందని తెలిపారు. అందులో భాగంగా, ఆల్ట్రా లగ్జరీ వస్తువులు, సిగరెట్లు వంటివి 'సిన్ గూడ్స్' పై 40% పన్ను విధించాలని కేంద్రం ప్రతిపాదనలో పేర్కొన్నది. దీనిని యూపీ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా ధృవీకరించారు. అలాగే, కార్లు, అల్ట్రా లగ్జరీ వస్తువులు, సిన్ గూడ్స్‌పై ప్రస్తుతం విధిస్తున్న పన్ను రేటును కొనసాగించడానికి పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య 40% జీఎస్‌టీ రేటు ప్రతిపాదించిందని తెలిపారు.

వివరాలు 

తుది నిర్ణయం జీఎస్‌టీ కౌన్సిల్‌లో..

కేంద్రం చేసిన ప్రతిపాదనలో కొత్త జీఎస్‌టీ శ్లాబ్‌ల అమలుతో కేంద్రం, రాష్ట్రాలకు కలిగే ఆదాయ నష్టం గురించి ప్రస్తావన లేదని ఆమె గుర్తుచేశారు. రేట్ల హేతుబద్ధీకరణకు సంబంధించి సామ్రాట్ చౌధరి నేతృత్వంలోని ఆరు సభ్యుల మంత్రుల బృందం గురువారం సమావేశమయ్యింది. ప్రస్తుతం నాలుగు శ్లాబులు (5%, 12%, 18%, 28%) ఉన్న సమయంలో, రెండు శ్లాబులు మాత్రమే (5%, 18%) ఉంచేందుకు మంత్రుల బృందం అంగీకరించింది. అదనంగా, హానికరమైన ఉత్పత్తులపై 40% జీఎస్‌టీ విధించేందుకు కూడా ఆమోదం తెలిపింది. తుది నిర్ణయం జీఎస్‌టీ కౌన్సిల్‌లో తీసుకోనున్నారు.