Page Loader
UPI Payments: రూ.3వేలు దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలను పెంచనున్న ప్రభుత్వం 
రూ.3వేలు దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలను పెంచనున్న ప్రభుత్వం

UPI Payments: రూ.3వేలు దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలను పెంచనున్న ప్రభుత్వం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈరోజుల్లో ఎటు చూసినా డిజిటల్ చెల్లింపులదే ఆధిపత్యం. చిన్న నుంచి పెద్ద మొత్తాల దాకా యూపీఐ (UPI) ద్వారా లావాదేవీలు జరిపే అలవాటు ప్రజల్లో బాగా పెరిగింది. గూగుల్ పే, ఫోన్ పే, పేటియం వంటి యాప్‌ల సాయంతో ప్రతి రోజు కోట్ల సంఖ్యలో చెల్లింపులు జరుగుతున్నాయి. టీ స్టాల్‌లో రూ.10కి టీ తాగినా యూపీఐ స్కాన్ చేసి చెల్లించే స్థాయికి వినియోగదారులు చేరుకున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. కానీ త్వరలోనే యూపీఐ లావాదేవీలపై మర్చెంట్ ఛార్జీలు (Merchant Charges) విధించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్లు సమాచారం.

వివరాలు 

మళ్లీ మర్చెంట్ డిస్కౌంట్ రేటు విధించే యోచన 

యూపీఐ చెల్లింపులపై మర్చెంట్ డిస్కౌంట్ రేటు (MDR)ను తిరిగి ప్రవేశపెట్టే అంశంపై కేంద్రం పునర్విచారణ జరుపుతోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వ్యాపారుల లావాదేవీ విలువ ఆధారంగా.. టర్నోవర్‌కు బదులుగా.. ఛార్జీలు వసూలు చేయాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా రూ.3 వేలకుపైగా ఉన్న యూపీఐ లావాదేవీలపై ఈ ఛార్జీలు వర్తించనున్న అవకాశముంది. చిన్న మొత్తాల చెల్లింపులకు మాత్రం ఎలాంటి ఫీజులు ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక వ్యవహారాల శాఖ (DEA), ఆర్థిక సేవల విభాగం (DFS) ఉన్నతాధికారుల మధ్య చర్చల దశలో ఉన్నట్లు జాతీయ మీడియాలో వెల్లడైంది.

వివరాలు 

ఇంతకు ముందు రద్దు చేసిన MDR ఛార్జీలు 

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2022లో యూపీఐ, రూపే (RuPay) ఆధారిత లావాదేవీలపై విధించే MDR ఛార్జీలను రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ వాటిని తీసుకురావాలన్న యోచనలో ఉన్నప్పటికీ, ఇది సాధారణ వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపదు. ఎందుకంటే యూజర్ల నుంచి ఏ విధమైన ఛార్జీలు వసూలు చేయబోమని అధికారులు అంటున్నారు. కానీ వ్యాపారులు మాత్రం ఈ ఛార్జీల భారం వల్ల మళ్లీ నగదు చెలామణి వైపు మొగ్గు చూపవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు 

యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్.ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ. భారత్‌లో డిజిటల్ పేమెంట్స్ రంగంలో యూపీఐ ఒక విప్లవాత్మక మార్గం అయింది. ఈ ఏడాది మే నెలలో యూపీఐ ద్వారా రూ.25.14 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఇది ఏప్రిల్ నెలలో నమోదైన రూ.23.94 లక్షల కోట్లతో పోలిస్తే సుమారు ఐదు శాతం ఎక్కువ.

వివరాలు 

రికార్డు స్థాయికి యూపీఐ లావాదేవీలు 

లావాదేవీల సంఖ్య ప్రకారం చూస్తే, మే నెలలో మొత్తం 1,867.7 కోట్లు చెల్లింపులు జరగ్గా, ఏప్రిల్‌లో ఇది 1,789.3 కోట్లుగా ఉంది. మొత్తంగా చూస్తే, గత ఏడాది ఇదే మే నెలతో పోలిస్తే యూపీఐ లావాదేవీల విలువలో 23 శాతం పెరుగుదల నమోదైంది. 2024 మేలో నమోదైన మొత్తం లావాదేవీలు రూ.20.44 లక్షల కోట్లే కావడంతో, ఏడాది వ్యవధిలో ఇది స్పష్టమైన వృద్ధి అని NPCI వెల్లడించింది.