Windfall tax: విండ్ ఫాల్ ట్యాక్స్ రద్దుకు కేంద్రం యోచన.. చమురు ఉత్పత్తి కంపెనీలకు గుడ్‌న్యూస్
కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని యోచిస్తోంది. ఈ చర్యకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని ప్రధానమంత్రి సలహాదారు తరుణ్ కపూర్ తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్న కారణంగా ఈ పన్ను ఇప్పుడు అంతగా అవసరం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. పెట్రోలియం శాఖ ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖకు తెలియజేసి ఉంటుందని కపూర్ వెల్లడించారు. ఆర్థిక మంత్రిత్వశాఖ దీనిపై పరిశీలన చేస్తున్నదని చెప్పారు. విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దు జరిగితే, రిలయన్స్, ఓఎన్‌జీసీ వంటి చమురు సంస్థలకు ఇది ఊరట కలిగించనుంది.
చమురు ధరలను బట్టి పన్ను రేట్లను ప్రభుత్వం సవరిస్తుంది
భారత ప్రభుత్వం 2022 జూలై 1 నుండి పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను విధించింది. ప్రతి 15 రోజులకు ఒకసారి, రెండు వారాల సగటు చమురు ధరలను బట్టి పన్ను రేట్లను ప్రభుత్వం సవరిస్తుంది. బాహ్య కారకాల వల్ల చమురు ఉత్పత్తి కంపెనీలు పొందుతున్న అదనపు లాభాలపై ఈ విండ్‌ఫాల్ ట్యాక్స్ విధించబడింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలపై ఆంక్షలు విధించడంతో చమురు ధరలు భారీగా పెరిగాయి, ఈ సమయంలో దేశీయ చమురు సంస్థలకు లాభాలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో ఈ పన్నును రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.