
LIC stake sale: ఎల్‌ఐసిలో మైనారిటీ వాటాను విక్రయించనున్న ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో కేంద్ర ప్రభుత్వం మళ్లీ తన వాటాను విక్రయించే దిశగా సన్నద్ధమవుతోంది. ఈ చర్య కోసం పెట్టుబడుల ఉపసంహరణ విభాగం ప్రణాళికలు రూపొందిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎల్‌ఐసీలో కేంద్రానికి 96.5 శాతం వాటా ఉన్నప్పటికీ,2022 మేలో ప్రారంభమైన ఐపీఓ సమయంలో ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయించిన విషయం విదితమే. అప్పుడు ఒక్కో షేరుకు ధరను రూ.902 నుంచి రూ.949 మధ్యగా నిర్ణయించి,దాని ద్వారా సుమారు రూ.21వేల కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి లభించింది. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీలో 'ఆఫర్ ఫర్ సేల్'(OFS) పద్ధతిలో మరింత వాటా విక్రయానికి కేంద్రం అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
వివరాలు
LIC మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.5.85 లక్షల కోట్లు
అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ ముమ్మరంగా ప్రారంభం కాకుండా, ప్రాథమిక దశలోనే ఉందని తెలుస్తోంది. మార్కెట్ పరిస్థితులను బట్టి పెట్టుబడుల ఉపసంహరణ విభాగం ఈ వాటా విక్రయాన్ని కొనసాగించనుంది. అంతేకాదు, 2027 మార్చి 16 నాటికి పబ్లిక్ షేర్ హోల్డింగ్‌ను కనీసం 10 శాతానికి చేర్చాలన్న నియమాన్ని అనుసరించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా 6.5 శాతం వాటాను విక్రయించాల్సి ఉంటుంది. అయినప్పటికీ, ఎంత శాతం వాటాను విక్రయిస్తారు? వాటి ధర ఎంత ఉంటుంది? విక్రయం ఎప్పుడు జరగనుంది? వంటి కీలక వివరాలు ఇప్పటికీ అధికారికంగా వెల్లడికాలేదు. ప్రస్తుతం LIC మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.5.85 లక్షల కోట్లుగా ఉంది. కంపెనీ షేర్లు ప్రస్తుతం రూ.926 వద్ద ట్రేడవుతున్నాయి.