Gold: స్వదేశంలోనే భారీగా బంగారం నిల్వలు.. ఆర్బీఐ ఆర్థిక ఎత్తుగడ వెనుక అసలు కారణమిదే!
భారతదేశంలో బంగారం కేవలం ఆభరణాలకే పరిమితం కాకుండా, ఆర్థిక భద్రతను కాపాడే కీలక వనరుగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బంగారం నిల్వలను గణనీయంగా పెంచుతూ, ఏప్రిల్-సెప్టెంబర్ 2024 మధ్యకాలంలో 102 మెట్రిక్ టన్నులను తన డొమెస్టిక్ రిజర్వ్‌లకు జోడించింది. సెప్టెంబర్ 30 నాటికి మొత్తం 510.46 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దేశీయ వాల్ట్‌లలో నిల్వ చేయడం విశేషం. ఆర్ బి ఐ తన మొత్తం బంగారం నిల్వల్లో అదనంగా 32 మెట్రిక్ టన్నులను చేర్చగా, దీంతో మొత్తం నిల్వలు 854.73 మెట్రిక్ టన్నులుగా రికార్డు సృష్టించాయి.
బంగారం నిల్వల పెరుగుదల
విదేశీ మారక నిల్వల నిర్వహణలో భాగంగా బంగారం నిల్వలు పెంచుకోవడం, ద్రవ్యోల్బణం, కరెన్సీ మార్పిడి రిస్క్‌ల నుంచి రక్షణ పొందడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. విదేశాలలో గణనీయమైన బంగారం నిల్వలున్నప్పటికీ, 1991 తర్వాత తొలిసారిగా ఆర్బీఐ విదేశీ వాల్ట్‌ల నుంచి ఎక్కువ మొత్తంలో బంగారాన్ని స్వదేశానికి తరలించింది. ఈ చర్య భారతదేశం తన ఆస్తులను భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నుంచి రక్షించుకునేందుకు తీసుకున్న ముందుజాగ్రత్త చర్యగా పేర్కొనవచ్చు. ఇప్పుడు, 324.01 మెట్రిక్ టన్నుల బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) వంటి విదేశీ సంస్థల కస్టడీలో ఉంది.
బంగారం కొనుగోళ్ల చరిత్ర
మరో 20.26 మెట్రిక్ టన్నులు ఇతర సెంట్రల్ బ్యాంకుల్లో పెట్టుబడుల రూపంలో ఉన్నాయి. 2009లో అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నుంచి 200 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడం ప్రారంభమైంది. అప్పటి నుంచి, ఆర్బీఐ విదేశీ మారకపు ఆస్తుల డైవర్సిఫికేషన్ వ్యూహంలో భాగంగా బంగారం నిల్వలను క్రమంగా పెంచుతూ వస్తోంది. విదేశీ మారక నిల్వల్లో భాగంగా బంగారం విలువ 2024 సెప్టెంబర్ నాటికి 9.32%గా ఉంది. ఇది దేశ భద్రత కోసం బంగారాన్ని ప్రధాన ఆస్తిగా నిర్వహిస్తున్న ఆర్బీఐ భవిష్యత్తు కోసం తీసుకున్న కీలక నిర్ణయం ఇదేనని చెప్పొచ్చు.