ICICI Bank:సెబీ చీఫ్‌పై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన ఐసీఐసీఐ బ్యాంక్
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్ పదవీ విరమణ తర్వాత కూడా ఐసిఐసిఐ నుండి జీతం పొందుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆరోపించింది. 2017లో సెబీలో చేరినప్పటి నుంచి బుచ్ ఐసీఐసీఐ నుంచి మొత్తం రూ.16.8 కోట్ల ఆదాయాన్ని పొందారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ఆరోపణలన్నింటినీ ఖండిస్తూ ఐసీఐసీఐ బ్యాంక్ తన ప్రకటన విడుదల చేసింది.
సెబీ చీఫ్ ఏం పొందారు?
ఐసిఐసిఐ బ్యాంక్ గ్రూప్‌లో తన ఉద్యోగ సమయంలో, వర్తించే పాలసీల ప్రకారం జీతం, ఇతర ప్రయోజనాల రూపంలో బుచ్ పరిహారం పొందిందని స్పష్టం చేసింది. ICICI గ్రూప్‌లో తన పదవీకాలంలో, ఆమె సంబంధిత పాలసీల ప్రకారం జీతం, పదవీ విరమణ ప్రయోజనాలు, బోనస్, ESOPతో సహా పలు రకాల పరిహారం పొందారు. అదనంగా, అక్టోబరు 31, 2013 నుండి అమల్లోకి వచ్చే విధంగా సూపర్‌యాన్యుయేషన్ ప్లాన్‌లో పాల్గొనడానికి బుచ్ ఎంచుకున్నట్లు కూడా ప్రకటన వెల్లడించింది.
బ్యాంకు ఏం చెప్పింది?
ఈ విషయానికి సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ తన ప్రకటనలో, "ఐసిఐసిఐ బ్యాంక్ లేదా దాని గ్రూప్ కంపెనీలు మధాబి పూరీ బుచ్‌కి ఆమె పదవీ విరమణ ప్రయోజనాలకు మినహా ఎలాంటి జీతం లేదా ఉద్యోగి స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ (ESOP) అందించలేదు." "బుచ్‌కి ఆమె పదవీ విరమణ తర్వాత చేసిన అన్ని చెల్లింపులు ICICI గ్రూప్‌లో ఆమె ఉద్యోగ దశలో సంపాదించినవే. ఈ చెల్లింపులలో ESOP, పదవీ విరమణ ప్రయోజనాలు ఉన్నాయి" అని ప్రకటన పేర్కొంది.