
ICICI Bank Charges: యూపీఐ లావాదేవీలు.. పేటీఎం,గూగుల్‌పేకు షాక్ ఇచ్చిన ఐసీఐసీఐ
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా యూపీఐ ఆధారిత డిజిటల్ లావాదేవీల వినియోగం వేగంగా పెరుగుతోంది. చిన్నచిన్న గల్లీ దుకాణాల దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతిచోటా గూగుల్ పే, ఫోన్ పే, పేటియం వంటి యూపీఐ పేమెంట్ మాధ్యమాల వినియోగం విస్తృతమవుతోంది. ఈ నేపథ్యంలో యూపీఐ లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్న పేమెంట్ అగ్రిగేటర్లపై ఛార్జీలు వసూలు చేసేందుకు ప్రముఖ ప్రైవేట్ బ్యాంకైన ఐసీఐసీఐ బ్యాంక్ సిద్ధమవుతోంది. ఆగస్టు 1వ తేదీ నుంచే ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నట్లు కొన్ని ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. యూపీఐ లావాదేవీలను నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్లకు ఇప్పటికే ఈ నెల ప్రారంభంలోనే ఐసీఐసీఐ బ్యాంక్ సమాచారాన్ని అందించిందని ఆ కథనాల్లో పేర్కొన్నారు.
వివరాలు
ప్రతి లావాదేవీకి 4 బేసిస్ పాయింట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఎస్క్రో ఖాతాను నిర్వహించే పేమెంట్ అగ్రిగేటర్లపై ప్రతి లావాదేవీకి 2 బేసిస్ పాయింట్లు (Basis Points) చొప్పున,గరిష్ఠంగా రూ.6 వరకు ఛార్జీలు విధించనుందని సమాచారం. కానీ ఎస్క్రో ఖాతా లేని అగ్రిగేటర్లకు ఈ ఛార్జీలు రెట్టింపవుతాయి. అంటే, వారు ప్రతి లావాదేవీకి 4 బేసిస్ పాయింట్లు చొప్పున గరిష్ఠంగా రూ.10 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు ఐసీఐసీఐ బ్యాంక్ వద్ద ఖాతాలున్న మర్చెంట్స్‌కు ఎలాంటి అదనపు భారం పడదని బ్యాంక్ స్పష్టం చేసింది.
వివరాలు
NPCI కి చెల్లించాల్సిన వ్యయాన్ని ఐసీఐసీఐ బ్యాంకే భరిస్తోంది
ఈ ఛార్జీలు కేవలం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మర్చెంట్లకు డిజిటల్ పేమెంట్లు అందించే పేమెంట్ అగ్రిగేటర్లపైనే వర్తిస్తాయని తెలుస్తోంది. ఇప్పటివరకు యూపీఐ లావాదేవీల నిర్వహణ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి చెల్లించాల్సిన వ్యయాన్ని ఐసీఐసీఐ బ్యాంకే భరిస్తోంది. అయితే, ఆ ఖర్చు భారం తగ్గించుకునేందుకు, ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని బ్యాంక్ నిర్ణయించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.