Piyush Goyal: త్వరలో ప్రారంభంకానున్న భారత్-అమెరికా వాణిజ్య చర్చలు.. ఎజెండా ఏంటంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌పై పరస్పర సుంకాలు (Reciprocal Tariffs) విధిస్తామని ఇటీవల చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో, భారత కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ (Piyush Goyal) తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని సోమవారం ఆకస్మికంగా అమెరికా (US) వెళ్లారు.
మే 8 వరకు ఆయన అక్కడే ఉండి, అమెరికా అధికారులతో అత్యవసర వాణిజ్య చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అయితే, ఆయన ఆకస్మిక అమెరికా పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఇంకా వెల్లడించలేదు.
వివరాలు
ప్రతిపాదిత సుంకాలపై అమెరికా వైఖరి తెలుసుకోవడం..
ఈ చర్చల ద్వారా ప్రతిపాదిత సుంకాలపై అమెరికా వైఖరిని తెలుసుకోవడం, ఆ విధానాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని అంచనా వేయడం, అలాగే సుంకాల తగ్గింపు, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపరిచే ఒప్పందంపై చర్చించేందుకు కేంద్రమంత్రి ప్రాధాన్యతనిచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
"భారత దేశం ఆటోమొబైల్స్, రసాయన పరిశ్రమల ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు చర్చించేందుకు సిద్ధంగా ఉంది. అయితే, వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా చూపిస్తున్న ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదు. వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గిస్తే భారత రైతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి," అని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
వివరాలు
100 శాతానికి టారిఫ్ తగ్గింపు
భారత్, అమెరికాతో వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇప్పటికే కొన్ని కీలక చర్యలు చేపట్టింది.
హై-ఎండ్ మోటార్ సైకిళ్లపై సుంకాలను 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గించింది.
బోర్బన్ విస్కీ టారిఫ్‌ను 150 శాతం నుంచి 100 శాతానికి తగ్గించింది. ఇతర సుంకాలను సమీక్షిస్తామని, ఇంధన దిగుమతులను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం వెల్లడించింది.
అంతేకాకుండా, అమెరికా నుంచి మరిన్ని రక్షణ పరికరాలను కొనుగోలు చేయడానికి హామీ ఇచ్చింది.
ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పరస్పర సుంకాల కారణంగా భారతదేశానికి ఏటా సుమారు 7 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది.
వివరాలు
రక్షణ సహకారంపై చర్చలు
ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య పరమైన అంశాలు, రక్షణ సహకారంపై చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా, ట్రంప్ మాట్లాడుతూ, టారిఫ్‌ల విషయంలో ఎవరికి మినహాయింపు లేదని స్వయంగా మోదీకి స్పష్టం చేసినట్లు తెలిపారు.
భారత్ అమెరికా దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తోందని, ఇకపై అమెరికా కూడా అదే విధంగా ప్రతిస్పందిస్తుందని ఆయన తేల్చిచెప్పారు.