Page Loader
2075 నాటికి ఇండియా నంబర్ 2.. అమెరికా కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రికార్డ్ 
అమెరికా కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రికార్డ్

2075 నాటికి ఇండియా నంబర్ 2.. అమెరికా కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రికార్డ్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 11, 2023
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భవిష్యత్ లో భారతదేశం సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఈ నేపథ్యంలోనే 2075 వరకు అగ్రరాజ్యం అమెరికానే భారత్ అధిగమించనుంది. ఈ మేరకు ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ తన నివేదిక ద్వారా ప్రకటించింది. ఇప్పటికే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఐదో స్థానంలో కొనసాగుతోంది. అయితే 2075 నాటికి అమెరికా, జపాన్ సహా జర్మనీని సైతం భారత్ వెనక్కి నెట్టే అవకాశాలున్నట్లు తెలిపింది. సృజనాత్మకత, సాంకేతికత, పెట్టుబడులు, కార్మికుల సగటు ఉత్పాదకతలో యువశక్తి సాధించే వృద్ధి భారత్‌ను ముందుకు తీసుకెళ్తాయని గోల్డ్‌మన్ శాక్స్ వివరించింది. ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌లోనే యువజనాభా పెరుగుతూ, మరోవైపు వృద్ధులు, చిన్నారుల శాతం తగ్గుతుందని నివేదిక బహిర్గతం చేసింది.

details

లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగితేనే ఆర్థిక అభివృద్ధి

పెట్టుబడుల్లో పెరుగుదల, సృజనాత్మకత, కార్మికుల ఉత్పాదకతలో పెరుగుదల లాంటివి భారత ఆర్థిక రంగానికి ఇంజిన్ లాగా నిలుస్తాయని గోల్డ్‌మన్ శాక్స్‌ వెల్లడించింది. ఆర్థిక అంశాల్లో వృద్ధి కారణంగా ప్రజల సేవింగ్స్ మొత్తాలు పెట్టుబడులుగా మారతాయని భారత సంతతి ఆర్థికవేత్త శంతను సేన్‌గుప్తా తెలిపారు. ఫలితంగానే ఇండియన్ ఎకానమీ వేగంగా దూసుకుపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్‌లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ (పనిలో కార్మికుల భాగస్వాములయ్యే రేట్ ) ఆశించిన స్థాయిలో పెరగకపోతే ఆర్థిక అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందన్నారు. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఒక దేశ జనాభాలో ప్రస్తుతం ఉపాధి పొందుతున్న వారి సంఖ్యతో సహా ఉపాధి వెతుకుతున్న వారి సంఖ్యను కొలమానంగా పరిగణిస్తారు.