ఇండియన్ మార్కెట్లలోకి డబ్బే డబ్బు.. భారత బాండ్లలోకి త్వరలోనే 25 బిలియన్ డాలర్లు
భారత ఆర్థిక వృద్ధి, ప్రపంచ దేశాలను గత కొంత కాలంగా ప్రపంచదేశాలను ఆకర్షిస్తోంది. ఈ మేరకు విదేశీ కంపెనీలు, మదుపర్లు, దేశంలో పెట్టుబడులకు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. జేపీ మోర్గాన్ తాజా నిర్ణయమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దీంతో భారత బాండ్లపై అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పెరగనుంది. జేపీ మోర్గాన్ ఎమర్జింగ్ మార్కెట్లు బాండ్ ఇండెక్స్ లో కేంద్ర ప్రభుత్వం(భారత ప్రభుత్వం) బాండ్లకు చోటు దక్కనుంది. ఈ క్రమంలోనే బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు భారతదేశంలోకి రానున్నాయి. అంతర్జాతీయ సూచీల్లో ఇండెక్స్ జారీ సంస్థలు తమ సూచీలను విస్తరించాలనుకోవడంతో ఇండియాకు లైన్ క్లియర్ అయ్యింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా అనేక సూచీల నుంచి జారిపోయింది.
చైనా నుంచి భారతదేశం తరలివస్తున్న కంపెనీలు
కఠిన ఆంక్షలు, పలు దేశాలతో వివాదాలు, ఆర్థిక ఒడుదొడుకులతో చైనా సైతం సూచీల ఆదరణ కోల్పోయింది. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దూసుకెళ్తున్న భారత్‌కు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. జేపీ మోర్గాన్ నిర్ణయంతో సుమారు 330 బిలియన్ డాలర్ల విలువగల 23 బాండ్లు ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్‌లో చోటు సంపాదించుకోనున్నాయి. 2022 చివరినాటికి 7.4 బిలియన్ డాలర్లుగా ఉంటే, విదేశీ మదుపర్లు ఆసక్తితో ప్రస్తుతం పెట్టుబడుల విలువ అమాంతం 12 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఓవైపు భౌగోళిక రాజకీయాల్లో, వివిధ కీలక అంతర్జాతీయ వేదికలపైనా భారతదేశం కీలక పాత్ర నిర్వర్తిస్తోంది.ఈ నేపథ్యంలోనే ప్రపంచస్థాయిలో పెట్టుబడులు ఇండియా వైపు చూస్తున్నాయి. ఇందులో భాగంగానే అభివృద్ధిలో దూసుకెళ్తున్న డ్రాగన్ చైనా నుంచి కంపెనీలన్నీ బయటకు రావాలనుకుంటున్నాయి.
పెట్టుబడులకు కేంద్రంగా ఎదుగుతున్న భారత్
అంతేకాదు ఆయా సంస్థలన్నీ తమ పెట్టుబడులకు భారత్‌నే కేంద్రంగా చేసుకుంటున్నాయి. ప్రస్తుతానికి భారత బాండ్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటా పరిమితంగానే ఉంది. అయితే గత కొన్నాళ్లుగా ఫారిన్ ఇన్వెస్టుమెంట్లు జోరు అందుకున్నాయి. కొవిడ్, తర్వాత పరిణామాల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంది. ఫలితంగా అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత ఆర్థిక వ్యవస్థే దృఢంగా కనిపిస్తోంది. జేపీ మోర్గాన్ తాజా నిర్ణయంతో 2025 మార్చి నాటికి భారత మార్కెట్లోకి 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నట్లు ఆర్థిక నిపుణుల అంచనా. గతేడాది భారత బాండ్లలోకి విదేశీ మదుపర్లు కేవలం 3.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు.ఆర్థికంగా ఎదుగుతున్న దేశాల కంటే ఇండియా ఆర్థికంగా పటిష్ఠంగా ఉండటమే కారణంగా నిలుస్తోంది.