Kotak:అదానీ హిండెన్‌బర్గ్ వివాదం.. మధ్యలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తావన!
అమెరికన్ షార్ట్-సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జూలై 2, మంగళవారం, అదానీ గ్రూప్ షార్ట్ షేర్లకు తన ఇన్వెస్టర్ పార్టనర్‌లలో ఒకరి ద్వారా ఆఫ్‌షోర్ ఫండ్ నిర్మాణాన్ని ఉపయోగించినట్లు తెలిపింది. ఈ ఆఫ్‌షోర్ ఫండ్ నిర్మాణాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ సృష్టించి, నిర్వహించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఒక ప్రైవేట్ రంగ బ్యాంకు, బ్రోకరేజీ సంస్థ, ఉదయ్ కోటక్ చేత స్థాపించబడింది. అదానీ గ్రూప్‌కు సంబంధించిన నివేదికకు సంబంధించి హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. దాదాపు 46 పేజీలతో కూడిన ఈ నోటీసును జూన్ 27న జారీ చేశారు. దీని తరువాత, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నుండి ఈ ప్రకటన వచ్చింది.
కోటక్ బ్యాంకు ప్రస్తావన..
హిండెన్‌బర్గ్ మాట్లాడుతూ.. కోటక్ బ్యాంకు ఫారిన్ లో ఓ ఫండ్‌ను ఏర్పాటు చేసిందని తెలిపింది.దాన్ని ఉపయోగించుకొని ఓ పెట్టుబడి భాగస్వామి ద్వారా అదానీ స్టాక్స్‌ను షార్ట్ చేసినట్లు ఆరోపించింది. దీనివల్ల కోటక్ బ్యాంకు లాభాలు సంపాదించలేకపోయిందని తెలిపింది. ఆ పెట్టుబడి భాగస్వామి ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. సెబీ అందించిన షోకాజ్ నోటీసుల్లో ఎక్కడా కోటక్ పేరు గానీ, ఆ సంస్థ బోర్డు సభ్యుల ప్రస్తావన గానీ లేదని హిండెన్‌బర్గ్ పేర్కొంది. దీన్నిబట్టి సెబీ మరో భారత వ్యాపారవేత్తను రక్షించే యోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోందని ఆరోపించింది.
అదానీ గ్రూప్‌పై ఒక నివేదిక విడుదల చేసిన హిండెన్‌బర్గ్
KMIL అంటే కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్. దర్యాప్తు నుంచి వ్యాపారవేత్తను రక్షించేందుకు కోటక్ పేరును సెబీ దాచిపెట్టి ఉండవచ్చని హిండెన్‌బర్గ్ ఆరోపించారు. హిండెన్‌బర్గ్ గత సంవత్సరం 24 జనవరి 2023న అదానీ గ్రూప్‌పై ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో, అదానీ గ్రూప్ కంపెనీలలో స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్ ఆరోపణలు ఉన్నాయి. అదానీ గ్రూప్ రూ. 20,000 కోట్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్‌కు ముందు ఈ నివేదిక వచ్చింది. ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్ అప్పట్లోనే తీవ్రంగా ఖండించింది.
హిండెన్‌బర్గ్‌తో మాకు సంబంధం లేదు: కోటక్ గ్రూప్
అదానీ గ్రూప్ షేర్ల షార్ట్ సెల్లింగ్‌లో హిండెన్‌బర్గ్‌కు చెందిన ఇన్వెస్టర్లకు సహకరించిందన్న ఆరోపణలను కోటక్ గ్రూప్ తోసిపుచ్చింది. హిండెన్‌బర్గ్‌తో తమ సంస్థలైన K-ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, KMILకు సంబంధం లేదని స్పష్టం చేసింది. 'క్లైంట్‌గా లేదా ఇన్వెస్టర్‌గా హిండెన్‌బర్గ్‌కు మా సంస్థతో సంబంధం లేదు. మా ఇన్వెస్టర్లలో ఎవరితోనైనా హిండెన్‌బర్గ్ పార్ట్‌నర్‌గా ఉందనే విషయం తెలియదు' అని పేర్కొంది.