LIC: స్టాక్ మార్కెట్ ప్రభావం.. ఎల్‌ఐసీ పెట్టుబడుల్లో ₹84 వేల కోట్ల నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా తమ విలువను కోల్పోయాయి.గరిష్ట స్థాయుల నుంచి 10 శాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ముఖ్యంగా విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం,వాణిజ్య యుద్ధ భయాలు వంటి అంశాలు ఇందుకు ప్రధాన కారణాలు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో దలాల్ స్ట్రీట్ (Stock Market)లో పెట్టుబడులు చేసినవారి పోర్ట్‌ఫోలియోలు భారీగా నష్టపోతున్నాయి.
ప్రముఖ మదుపర్లుగా పేరుగాంచిన టాప్-10 మంది పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలు సుమారు రూ.81 వేల కోట్ల మేర నష్టపోగా, భారత ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) కూడా గణనీయమైన నష్టాన్ని ఎదుర్కొంది.
గత రెండున్నర నెలల్లో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ ఏకంగా రూ.84 వేల కోట్ల మేర తగ్గింది.
వివరాలు
స్టాక్ మార్కెట్ కరెక్షన్ కారణంగా భారీ నష్టం
ఎల్‌ఐసీ స్టాక్ మార్కెట్‌లో లిస్టెడ్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టే సంస్థ.
అయితే, ఇటీవల జరిగిన మార్కెట్ కరెక్షన్ కారణంగా సంస్థ పెట్టుబడుల విలువ జనవరి 1, 2025 నుండి ఫిబ్రవరి 18, 2025 వరకు సుమారు రూ.84,247 కోట్ల మేర పడిపోయింది.
గతేడాది డిసెంబర్ త్రైమాసికానికి ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ.14.72 ట్రిలియన్లు (రూ.14.72 లక్షల కోట్లు)గా ఉండగా, 2025 ఫిబ్రవరి 18 నాటికి ఇది రూ.13.87 ట్రిలియన్లకు (రూ.13.87 లక్షల కోట్లు) తగ్గిపోయింది.
మొత్తం మీద సంస్థ పెట్టుబడుల్లో 5.7 శాతం మేర నష్టం సంభవించింది.
వివరాలు
ఎల్‌ఐసీ ప్రధాన పెట్టుబడులు
2024 డిసెంబర్ నాటికి ఎల్‌ఐసీ 330కంపెనీల్లో 1శాతానికి పైగా వాటాను కలిగి ఉంది.
బీఎస్‌ఈ (BSE) లిస్టెడ్ కంపెనీల్లో మొత్తం మార్కెట్ కాపిటలైజేషన్‌లో ఈ కంపెనీల వాటా దాదాపు 66 శాతం.
మార్కెట్ నష్టాల ప్రభావంతో ఈ కంపెనీల షేర్ల విలువ కూడా పడిపోతున్నాయి.
ఎల్‌ఐసీ పెట్టుబడుల ప్రధాన భాగాన్ని కలిగి ఉన్న కంపెనీలు:
ఐటీసీ (ITC)-రూ.11,863 కోట్లు,ఎల్‌అండ్‌టీ (L&T) రూ.6,713 కోట్లు,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) - రూ.5,647 కోట్లు.
అలాగే,టీసీఎస్ (TCS),జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (Jio Financial Services),హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies),జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (JSW Steel),అదానీ పోర్ట్స్ (Adani Ports),హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank),ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank)వంటి ప్రముఖ కంపెనీల్లోనూ ఎల్‌ఐసీ పెట్టుబడులు పెట్టింది.