
xAI : ఆపిల్,ఓపెన్‌ఏఐపై ఎలాన్ మస్క్ కంపెనీ xAI యాంటీట్రస్ట్ దావా
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న xAI, X సంస్థలు అమెరికాలోని టెక్సాస్ ఫెడరల్ కోర్టులో ఆపిల్, ఓపెన్‌ఏఐపై యాంటీట్రస్ట్ దావా వేసింది. ఈ రెండు టెక్ దిగ్గజాలు కలసి స్మార్ట్‌ఫోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పోటీతత్వాన్ని అణగదొక్కుతున్నాయని మస్క్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. 61 పేజీల ఫిర్యాదులో, ఆపిల్-ఓపెన్‌ఏఐ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుని, iPhone ఆపరేటింగ్ సిస్టంలో ఓపెన్‌ఏఐ రూపొందించిన ChatGPTకే స్థానం ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో మస్క్ సంస్థ xAI రూపొందించిన Grok వంటి ప్రత్యామ్నాయ ఏఐలకు అవకాశమే లేకుండా పోయిందని తెలిపారు.
వివరాలు
ఆపిల్ అమెరికా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 65% వాటా
"ఇది రెండు మోనోపలిస్టులు (ఏకాధిపత్య సంస్థలు) కలసి, ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్న కృత్రిమ మేధస్సు రంగంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకునేందుకు చేస్తున్న కుట్ర" అని ఫిర్యాదులో వెల్లడించారు. మస్క్ సంస్థల వాదన ప్రకారం, ప్రస్తుతం ఓపెన్‌ఏఐకి generative AI చాట్‌బాట్‌లలో 80% మార్కెట్ వాటా ఉంది. ఆపిల్ అమెరికా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 65% వాటా కలిగి ఉందని పేర్కొన్నారు. 2024 జూన్‌లో ఆపిల్ - ఓపెన్‌ఏఐ భాగస్వామ్యం ప్రకటించాయి. ఆ ఒప్పందం ప్రకారం, iPhoneలో Siri సహా పలు ఫీచర్లలో ChatGPTకే ప్రత్యేకంగా యాక్సెస్ కల్పించారు. దీంతో వందల మిలియన్ల ఐఫోన్ వినియోగదారుల నుంచి వచ్చే బిలియన్ల ప్రశ్నలు ChatGPTకే చేరుతున్నాయని ఫిర్యాదులో వెల్లడించారు.
వివరాలు
శాశ్వత ఇంజంక్షన్‌తో పాటు బిలియన్ల డాలర్ల పరిహారం కూడా డిమాండ్ చేసిన మస్క్ కంపెనీలు
అదేవిధంగా, యాపిల్ ఉద్దేశపూర్వకంగానే Grok యాప్ అప్‌డేట్లను ఆలస్యం చేస్తూ, App Store ర్యాంకింగ్స్‌ను కూడా ChatGPTకు అనుకూలంగా మలిచిందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో పోటీని అణగదొక్కే చర్యలు నిలిపివేయాలని, మస్క్ కంపెనీలు శాశ్వత ఇంజంక్షన్‌తో పాటు బిలియన్ల డాలర్ల పరిహారం కూడా డిమాండ్ చేశాయి. కేసు జ్యూరీ ట్రయల్ ద్వారా విచారణ జరపాలని కోర్టును అభ్యర్థించాయి. "ఇది మస్క్ ఎప్పటికప్పుడు జరుగుతున్న వేధింపుల పద్ధతిలో భాగమే" అని ఓపెన్‌ఏఐ ప్రతిస్పందించింది. కాగా యాపిల్ ఈ విషయంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇటీవల మస్క్ - ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరిగింది.
వివరాలు
2023లో xAI ప్రారంభం
ర్యాంకింగ్ మానిప్యులేషన్ ఆరోపణలు మస్క్ చేయడం ఆశ్చర్యకరమని, వాస్తవానికి మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో తానే తనకు అనుకూలంగా వ్యవహరిస్తారని ఆల్ట్‌మాన్ విమర్శించారు. దీనిపై మస్క్ ఆల్ట్‌మాన్‌ను "అబ్బదాలకోరు" అని అన్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, మస్క్ - ఆల్ట్‌మాన్ ఇద్దరూ ఓపెన్‌ఏఐ స్థాపకులే. అయితే 2018లో మస్క్ ఆ సంస్థ నుంచి వైదొలగగా, అప్పటి నుంచి ఇద్దరి మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తమయ్యాయి. ఓపెన్‌ఏఐ 2022 చివర్లో చాట్‌జీపీటీ విడుదల చేసిన తర్వాత, ఏఐ రంగంలో పెట్టుబడులు బిలియన్ల డాలర్లకు చేరాయి. దీనికి ప్రతిస్పందనగా మస్క్ 2023లో xAIను ప్రారంభించి, ఓపెన్‌ఏఐతో పాటు ఇతర ఏఐ దిగ్గజాలకు పోటీగా రంగంలోకి దిగారు.