
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 25,500 దిగువకు నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అమెరికా అమలు చేయబోయే టారిఫ్ డెడ్‌లైన్ జులై 9 సమీపిస్తున్న నేపథ్యంలో, మదుపరులు జాగ్రత్తగా వ్యవహరించారు. దీనితో లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థల షేర్లలో అమ్మకాలు ఊపందుకోవడంతో సూచీలపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలో నమోదైన లాభాలు క్రమంగా తగ్గి పోయాయి. నిఫ్టీ సూచీ 25,500 స్థాయికి దిగువకు చేరింది.
వివరాలు
25,453.40 వద్ద స్థిరపడిన నిఫ్టీ
సెన్సెక్స్ ట్రేడింగ్ ఉదయం 83,790.72 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది (గత ముగింపు స్థాయి: 83,697.29 పాయింట్లు). ట్రేడింగ్ మద్యలో ఇది 83,935.01 పాయింట్ల గరిష్ఠాన్ని చేరుకుంది. అయితే, అనంతరం లాభాల స్వీకరణ ప్రభావంతో సూచీ నష్టాల్లోకి జారుకుంది. చివరికి 287 పాయింట్ల నష్టాన్ని నమోదు చేస్తూ 83,409.69 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది. అదే సమయంలో, నిఫ్టీ సూచీ 88.40 పాయింట్ల నష్టంతో 25,453.40 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.68గా నమోదైంది.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 67.70 డాలర్లు
సెన్సెక్స్‌లో అంతర్భాగంగా ఉన్న 30 షేర్లలో బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బీఈఎల్ షేర్లు ఎక్కువగా నష్టాలను చవిచూశాయి. మరోవైపు, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 67.70 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర ఔన్సుకి 3352 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.