Jeffries estimate: 2025లో నిఫ్టీ 26,600కు చేరే అవకాశం
ప్రస్తుతం భారతదేశంలోని కార్పొరేట్ సంస్థల ఆదాయాలు ఆకర్షణీయంగా నమోదు కావడం లేదు. వినియోగం తగ్గడం, అధిక ద్రవ్యోల్బణం, నిధుల వ్యయం అధికంగా ఉండటం ఈ పరిస్థితికి కారణని చెప్పొచ్చు. సెప్టెంబరు త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు అంచనాల కంటే తగ్గడంతో ఆర్ బి ఐ వృద్ధి అంచనాలను తగ్గించింది. దీని ప్రభావంతో విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను కొంత వెనక్కి తీసుకుంటున్నారు. అయినప్పటికీ డిసెంబర్‌లో వారు తిరిగి కొనుగోళ్లకు వచ్చారు. అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ తాజా నివేదికలో 2024 డిసెంబర్ నాటికి నిఫ్టీ 50 సూచీ 26,600 పాయింట్ల వద్ద ఉండాలని అంచనా వేసింది.
10శాతం లాభాలు కంటిన్యూ అయ్యే అవకాశం
ప్రస్తుతం నిఫ్టీ 50 ఫార్వార్డ్ ప్రైస్-ఎర్నింగ్ రేషియో గత అయిదేళ్ల సగటు కంటే ఎక్కువగా ఉంది. అయితే 10శాతం లాభాలు కంటిన్యూ అవుతాయని భావిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు వచ్చే ఏడాదిలో అధిక ఆదాయాలు నమోదు చేసే అవకాశాల నేపథ్యంలో లార్జ్ క్యాప్ కంపెనీలు పెట్టుబడులకు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వగలవని జెఫ్రీస్ పేర్కొంది. ఆర్థిక సేవలు, ఐటీ, టెలికాం, ఆటోమొబైల్, వైద్య ఆరోగ్య సేవలు, వినియోగం, విద్యుత్తు, స్థిరాస్తి రంగాల్లో పెట్టుబడులు లాభదాయకంగా ఉండొచ్చని సూచించింది. ఇది కాకుండా, 2024లో దేశ వృద్ధి రేటు మెరుగుపడుతుందని కూడా జెఫ్రీస్ అంచనా వేస్తోంది.
రూ.25,000 కోట్ల పైగా పెట్టుబడులు
ఈ ఏడాది ఎఫ్‌ఐఐలు పెట్టుబడులను ఉపసంహరించుకున్నా దేశీయ రిటైల్ మదుపరులు వృద్ధికి సహకరించారు. ప్రస్తుతం డిసెంబర్‌లో ఎఫ్‌ఐఐలు రూ.25,000 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాదిలో ఐపీఓల ద్వారా రూ.1.5 లక్షల కోట్ల వరకు సమీకరించినట్టు జెఫ్రీస్ తెలిపింది. ఈ జోరు వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని అంచనా వేసింది. 2025లో అత్యధిక ఆశాభావంతో కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, టీవీఎస్ మోటార్, గోద్రేజ్ ప్రాపర్టీస్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీలు ఉన్నాయి.