NTPC Green Energy Listing: 3 శాతానికి పైగా ప్రీమియంతో స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ
ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ అనుబంధ సంస్థ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ బుధవారం దలాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టింది. కానీ ఈ షేర్ మార్కెట్‌లో కేవలం 3 శాతం ప్రీమియంతో ప్రవేశించింది. ఈ షేరు ఇష్యూ ధర రూ.108గా నిర్ణయించబడింది, కానీ ఎన్‌ఎస్‌ఈలో ఇది 3.2 శాతం ప్రీమియంతో రూ.111.50 వద్ద ప్రారంభమైంది. అదే సమయంలో బీఎస్‌ఈలో 3.33శాతం ప్రీమియంతో రూ.111.60 వద్ద లిస్ట్ అయ్యింది. ఈ ఐపీఓ ద్వారా రూ.10,000కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.3,960కోట్లను కంపెనీ సమీకరించింది. మిగతా నిధులను షేర్ల జారీ ద్వారా సంపాదించగా,నవంబరు 19 నుంచి 22 వరకు జరిగిన ఐపీఓకు 2.55 రెట్లు సబ్‌స్క్రిప్షన్ వచ్చింది.
నవంబర్ 25న షేరు అలాట్‌మెంట్ ప్రక్రియ పూర్తి
56 కోట్ల షేర్లకు 142 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి, 22 లక్షల దరఖాస్తులు వచ్చాయి. క్యూఐబీ కోటా 3.51 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది, ఎన్‌ఐఐ కోటా 85 శాతం సబ్‌స్క్రిప్షన్‌ను అందుకుంది. అలాగే, రిటైల్ కేటగిరీ లో 3.59 రెట్లు బిడ్లు దాఖలయ్యాయి. ఈ పబ్లిక్ ఇష్యూలో షేరు ధర శ్రేణిని రూ.102-రూపే 108 మధ్యగా నిర్ణయించింది. ఈ నిధులను రుణాలు, ముందస్తు చెల్లింపులు నిర్వహించేందుకు వినియోగిస్తారని, ఇంకా కొంత మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగిస్తామని కంపెనీ వెల్లడించింది. నవంబర్ 25న షేరు అలాట్‌మెంట్ ప్రక్రియ పూర్తి అయింది.
దేశంలో అతి పెద్ద పునరుత్పాదక ఇంధన ప్రభుత్వ రంగ సంస్థగా ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ
2022 ఏప్రిల్‌లో స్థాపించబడిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, దేశంలో అతి పెద్ద పునరుత్పాదక ఇంధన ప్రభుత్వ రంగ సంస్థగా నిలుస్తోంది. ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, నువామా వెల్త్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.