
Fintech apps halts Rent payment: RBI కొత్త నిబంధనలతో.. క్రెడిట్ క్రెడిట్ కార్డ్ రెంట్ పేమెంట్లను నిలిపివేసిన ఫోన్‌పే,పేటీయం
ఈ వార్తాకథనం ఏంటి
క్రెడిట్ కార్డు ద్వారా ఇళ్ల అద్దె చెల్లింపులు చేసే వారికి ఇకపై ఇబ్బందులు తప్పవు. ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫార్మ్‌లైన ఫోన్ పే, పేటియం, క్రెడ్ రెంట్ పేమెంట్ సదుపాయాన్ని నిలిపివేశాయి. దీనికి కారణం ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు. ఇటీవలి కాలంలో చాలా మంది అద్దె చెల్లింపు ఆప్షన్‌ను ఉపయోగించేవారు. ముఖ్యంగా నగదు కొరత ఉన్నపుడు క్రెడిట్ కార్డు ద్వారా ఇతర ఖాతాలకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసి, వాటిని నగదు రూపంలో పొందుతూ ఖర్చులను తీర్చుకోవడం అలవాటు అయింది. అయితే, ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కారణంగా ఈ సర్వీసులు తాత్కాలికంగా ఆగిపోయాయి.
వివరాలు
ఆర్‌బీఐ మార్గదర్శకాలు ఏమంటున్నాయి?
పేమెంట్ అగ్రిగేటర్లు, గేట్‌వేలకు సంబంధించి ఆర్‌బీఐ కఠిన నిబంధనలు విధించింది. సెప్టెంబర్ 15న జారీ చేసిన ఆదేశాల ప్రకారం, లావాదేవీ జరుగుతున్న సంస్థకు నేరుగా సంబంధం లేని వర్గాలకు పేమెంట్లను ప్రాసెస్ చేయరాదని స్పష్టం చేసింది. అలాగే, కేవలం కేవైసీ ధృవీకరణ పూర్తయిన మర్చంట్లకు మాత్రమే చెల్లింపులు జరపాలని సూచించింది. ఇళ్ల యజమానులు ఎవరూ రిజిస్టర్డ్ వ్యాపారులుగా పరిగణించబడరని కారణంగా, ఫిన్‌టెక్ యాప్స్ రెంట్ పేమెంట్ ఆప్షన్‌ను నిలిపివేయక తప్పలేదు. దీంతో ఇప్పటివరకు క్రెడిట్ కార్డులపై ఆధారపడి అద్దె చెల్లిస్తున్నవారికి ఇది పెద్ద ఇబ్బందిగా మారింది.
వివరాలు
బ్యాంకులు ముందు నుంచే
అద్దె చెల్లింపు సదుపాయాన్ని నగదు అవసరాల కోసం ఉపయోగిస్తున్నవారిని బ్యాంకులు ముందే పసిగట్టాయి. అందువల్ల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఇలాంటి ట్రాన్సాక్షన్లపై 1 శాతం ఫీజు వసూలు చేయడం ప్రారంభించాయి. అంతేకాకుండా, వీటిపై రివార్డు పాయింట్లను నిలిపివేశాయి. ఇక కొన్ని ఫిన్‌టెక్ సంస్థలు కూడా ఈ దుర్వినియోగాన్ని గమనించి, కొంతకాలం పాటు రెంట్ పేమెంట్ సేవను నిలిపివేశాయి. తర్వాత కఠిన కేవైసీ నిబంధనలు పాటిస్తూ మళ్లీ ప్రారంభించాయి. ప్రస్తుతం ఆర్‌బీఐ కొత్త నిర్ణయంతో, ఈ ఆప్షన్‌పై ఆధారపడిన వినియోగదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.